ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి కన్నుమూత‌

ప్రముఖ రచయిత్రి, తొలితరం పాత్రికేయురాలు, ప్రముఖ కవి ఆరుద్ర సతీమణి కూచి రామలక్ష్మి (93) శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె మ‌ర‌ణ‌వార్త తెలిసిన వెంట‌నే ప‌లువురు ప్ర‌ముఖులు ఆమె నివాసానికి వెళ్లి పార్దివ దేహంపై పూల‌దండ‌లు వేసి నివాళుల‌ర్పించారు.
 
వయోభారం, అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మలక్‌పేటలోని తన పెద్ద కుమార్తె కవిత ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినీ, సాహిత్య రంగాలకు కె.రామలక్ష్మిగా సుపరిచితురాలైన ఆమె ‘జీవన జ్యోతి’, ‘చిన్నారి పాపలు’ తదితర సినిమాలకు కథ, మాటలు అందించారు.
 
రామలక్ష్మి రాసిన ఓ కథ ఆధారంగానే ‘గోరింటాకు’ సినిమా తీశారు. ఆమెకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితతో ఉన్న పరిచయం నేపథ్యంలో.. ఆ సినిమా చిత్రీకరణ జయలలిత ఇంట్లో జరిగింది.
 
కాగా, 1930 డిసెంబర్ 31న కాకినాడ సమీపంలోని కోటనందూరులో జన్మించిన ఆమె మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు.  1951లోనే సాహిత్య రంగంలోకి అడుగుపెట్టారు. ఆంగ్లం, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యాన్ని ఆమె అవపోసాన పట్టారు.  సీనియర్‌ జర్నలిస్టు ఖాసా సుబ్బారావు ప్రోత్సహంతో ‘తెలుగు స్వతంత్ర’ పత్రిక ఆంగ్ల విభాగంలో సబ్‌-ఎడిటర్‌ గా పని చేశారు.
 
అప్పుడే ఆరుద్ర, శ్రీశ్రీ వంటి సాహితీ వేత్తలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆరుద్ర, రామలక్ష్మి వివాహం 1954లో జరిగింది. ఆరుద్ర సాహిత్యానికి తొలి విమర్శకురాలు రామలక్ష్మి. స్త్రీ సంక్షేమ సంస్థల్లో విధులు నిర్వర్తించారు.  ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో రచనలు చేశారు.
రామలక్ష్మి ఆంధ్ర పత్రికలో చాలా కాలం ‘ప్రశ్నావళి’ శీర్షిక ద్వారా పాఠకుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చేవారు. సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగానూ చాలాకాలం ఉన్నారు. విడదీసే రైలు బళ్లు , మెరుపుతీగ, అవతలి గట్టు, తొణికిన స్వర్గం, ప్రేమించు ప్రేమకై, ఆంధ్ర నాయకుడు ..ఇలా 15కు పైగా నవలలు రాశారు. రామలక్ష్మి రచనల్లో అంతర్లీనంగా స్త్రీ వాదం చాలా బలంగా ఉంటుందని విమర్శకుల అభిప్రాయం.
 
రామలక్ష్మి, ఆరుద్ర దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో రెండవ అమ్మాయి కవయిత్రి రౌద్రి కొన్నేళ్ల కిందట కన్నుమూశారు. చిన్నకుమార్తె త్రివేణి అమెరికాలో స్థిరపడ్డారు.