ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గర… సుప్రీంలో కేసుపై గవర్నర్ ఆగ్రహం

 
అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారంటూ కేసీఆర్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంపై గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ దాఖలు చేసిన  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వైఖరిపై ట్విటర్ సాక్షిగా గవర్నర్ తీవ్ర విమర్శలు చేశారు.
 
ఢిల్లీ కంటే రాజ్‌భవన్‌ దగ్గరుందని, సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శాంతికుమారి రాజ్‌భవన్‌కు రాలేదని పేర్కొనడం ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్లి పిటీషన్ వేసే బదులు రాజ్ భవన్ కు వచ్చి ఆ బిల్లుల గురించి విచారింపవచ్చు గదా అన్నట్లు శాంతికుమారి వైఖరిని తమిళిసై తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్‌భవన్‌ను సందర్శించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర సమయం లేదా అని గవర్నర్ బాహాటంగానే ఆమెను  నిలదీసినంత స్థాయిలో ట్వీట్ చేశారు.
 
కనీస మర్యాదగా ఫోన్‌లో కూడా మాట్లాడలేదని, ప్రొటోకాల్ లేదని, పిలిచినా కూడా మర్యాద లేదని సీఎస్‌పై తమిళిసై నిప్పులు చెరిగారు. ‘మళ్లీ గుర్తు చేస్తున్నానని, ఢిల్లీ కంటే రాజ్‌భవనే దగ్గరని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతా’యని తమిళిసై హితబోధ చేశారు. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లడంపై గవర్నర్ పరోక్ష విమర్శలు చేయడం గమనార్హం.
 
సీఎస్ శాంతికుమారి వచ్చి మాట్లాడితే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని చెప్పకనే గవర్నర్ చెప్పారు. బిల్లులు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించటానికి కనీసం ఒక్కసారిగా వచ్చి కలవలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదనే విషయాన్ని గవర్నర్ తమిళిసై తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
 
ఇప్పటి వరకూ పది బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, గత ఏడాది సెప్టెంబరు నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల తర్వాత పంపించిన మూడు బిల్లులకు కూడా గవర్నర్‌ ఆమోదం తెలపలేదని పిటిషన్‌లో పేర్కొంది. తన పిటిషన్‌లో ప్రతివాదులుగా గవర్నర్‌ కార్యదర్శిని చేర్చింది.
శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోదముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని, అందుకే ఆర్టికల్‌ 32 కింద సుప్రీం కోర్టు తన న్యాయ పరిధిని ఉపయోగించాలంటూ న్యాయస్థానం తలుపు తట్టక తప్పలేదని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో వెల్లడించింది.
 
తాము ఎన్నో రకాల ఉద్దేశాలు, లక్ష్యాలతో బిల్లులను ఆమోదించి పంపితే గవర్నర్‌ ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, బిల్లుల్లో స్పష్టత కొరవడిందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం లేదని, అందుకే పెండింగ్‌లో పెట్టాల్సి వస్తోందని రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి
 
హోలీ తర్వాతనే సుప్రీంలో విచారణ
 
 ఇలా ఉండగా, తెలంగాణ గవర్నర్ తమిళిసైపై వేసిన కేసును ప్రభుత్వం సుప్రీంకోర్టులో శుక్రవారం ప్రస్తావించలేదు. హోలీ సెలవుల తరువాతే సుప్రీంలో గవర్నర్‌పై తెలంగాణా ప్రభుత్వ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. రిజిస్ట్రీ అనుమతించిన తేదీనే విచారణకు వస్తుందనే ప్రస్తావించలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
 
కాగా శనివారం నుండి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ఉన్నాయి. హోలీ సెలవుల తరువాతే తిరిగి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ఈ కారణంగా మరో వారం రోజుల తరువాతే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.