పరిపాలనా రాజధాని విశాఖపట్నమే

ఒక వంక మూడు రాజధానుల బిల్లు అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగానే ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖపట్నమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే మారుతున్నానని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని వెల్లడించారు.
 
విశాఖపట్టణంలో ప్రారంభమైన రెండు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ప్రసంగిస్తూ రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని జగన్ చెప్పారు. ‘‘ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలం. రాష్ట్రంలో సులవైన పారిశ్రామిక విధానం ఉంది. క్రియాశీలక ప్రభుత్వం ఉంది” అని చెప్పారు.
 
పైగా, “విశాఖ త్వరలోనే పరిపాలనా రాజధాని కాబోతోంది. నేను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నా. త్వరలోనే ఇది సాకారమవుతుంది’’ అని వివరించారు. ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు జగన్ చెప్పారు. పెట్టుబడులకు ముప్పులేని వాతావరణం ఏపీలో ఉందని, ఏపీలో సుస్థిరమైన అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని భరోసా ఇచ్చారు.
 
దేశ ప్రగతిలో రాష్ట్రం ఎంతో కీలకంగా మారిందని చెబుతూ ఇక్కడ నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు.
 
దేశంలో అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉందని జగన్ చెప్పారు. ఆరు ఓడ రేవులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయని, మరో 4 కొత్త పోర్టులు రాబోతున్నాయని వెల్లడించారు. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములున్నాయని తెలిపారు. సహజ వనరులతో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని జగన్‌ తెలిపారు.
దేశంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ, దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఏపీలో జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల అనుసంధానం కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

పోర్టులతో రహదారుల కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తామని, పారిశ్రామిక అభివృద్ధిలో రహదారుల కనెక్టివిటీ ఎంతో ముఖ్యమైన అంశం అని గడ్కరీ స్పష్టం చేశారు. మోదీ పాలనలో రోడ్ల అభివృద్ధి వేగం పుంజుకుందని చెప్పారు.  తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ పోర్టు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వివరించారు. సరకు రవాణా ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గడ్కరీ తెలిపారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని చెప్పారు. ఏపీలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వంతో సమాన భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ఉంటుందని వివరించారు.

 
30 శాతం రిలయన్స్ గ్యాస్ ఏపీ నుంచే
 
2002 నుంచి సహజ వాయువు రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెడుతోందని, దేశంలో 30 శాతం తమ గ్యాస్ ఉత్పత్తి ఏపీ నుంచే జరుగుతోందని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వెల్లడించారు. రాష్ట్రంలో జియో ద్వారా 4జీ నెట్‌వర్క్‌ 98 శాతం కవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. 5జీ టెక్నాలజీని 2023 చివరి నాటికి ఏపీ సహా దేశమంతా విస్తరిస్తామని తెలిపారు.
 
ఏపీ ఎకానమీలో జియో 5జీ.. కొత్త డిజిటల్ రివల్యూషన్ తీసుకురాబోతోందని తెలిపారు. ఏపీలో జియో కోసం రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఈ పెట్టుబడులు, 5జీ నెట్ వర్క్ రాకతో బిజినెస్, ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగబోతున్నాయని వివరించారు. ఏపీలోని 6 వేల గ్రామాలకు రిలయన్స్ రిటైల్ విస్తరించిందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.
 
1.29 లక్షల కిరాణా దుకాణాలతో రిలయన్స్ రిటైల్ సంబంధాలు కొనసాగిస్తోందని వివరించారు. రిలయన్స్ రిటైల్ 20 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా,  వేల సంఖ్యలో ఉద్యోగాలు పరోక్షంగా ఇవ్వగలిగిందని తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు.