14వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

 
ఈ నెల 14వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మార్చి 14న ఉదయం 10 గంటల నుంచి ఉభయసభలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.  మరోవైపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలనూ ఉద్దేశించి 10 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. బడ్జెట్‌ను మార్చి 17వ తేదీన ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
 
మార్చి 15వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించడంతో పాటు సీఎం జగన్ కూడా మాట్లాడే అకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ సర్కార్ యోచించింది. కానీ ఎన్నికలతో సంబంధం లేకుండా సభను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. 
 
మరోవంక, ఈ సమావేశాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. తాను విశాఖకు పరిపాలనను మారుస్తున్నట్లు, త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి  కొద్దిరోజుల కిందట ప్రకటించారు. తాజాగా విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కూడా జగన్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
 
ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా జగన్  కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఇటు 3 రాజధానుల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆ అంశంపై కూడా జగన్ మాట్లాడతారని సమాచారం. శాసనసభతో పాటు, మండలిలో ప్రభుత్వం అనుకున్న బిల్లులను ప్రవేశపెట్టి నెగ్గించుకునే అవకాశం ఉంది.