ఏపీలో రూ. 13 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు!

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా రెండు రోజులపాటు జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో సుమారుగా రూ. 13 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు ఏపీ ప్ర‌భుత్వంతో అంగీకారం కుదుర్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
 
“రాష్ట్రంతో భాగస్వామ్యానికి సంబంధించి మేం చూపిన ధృఢమైన నిబద్ధత కారణంగా, సానుకూల వ్యాపార పరిస్థితులు కారణంగా ఈ రెండు రోజుల సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని ఆయన తెలిపారు.
 
సాధ్యమైనంత త్వరగా ఎంవోయూలు కార్యరూపం దాల్చేటట్టుగా చూస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా ముఖ్యమంత్రి తెలిపారు. ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ. 8,84,823 కోట్లకు సంబంధించి 40 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నామని పేర్కొంటూ 1,90,268 మందికి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.

ఐటీ, ఐటీఈ రంగానికి సంబంధించి 56 ఒప్పందాలను కుదర్చుకున్నామని, వీటి విలువ రూ.25,587 కోట్లు అని చెబుతూ దానితో 1,04,442 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇక, టూరిజంకు 117 ఎంఓయూలు కుదుర్చుకున్నామని, ఇందులో రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా 30,787 మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఈ సదస్సు వేదికగా ఇవాళ రూ.3841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభిస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. దీనివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయ‌ని పేర్కొన్నారు. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటెక్, లారస్‌ ల్యాబ్, హేవెల్స్‌ఇండియా, శారదా మెటల్స్‌ , అల్లాయిస్‌ తదితర కంపెనీలు ఈపెట్టుబడులను పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

గణనీయమైన పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాల్లో ఒకటి రెన్యువబుల్‌ఎనర్జీని పేర్కొంటూ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్‌ స్టో్టరేజీ మరియు గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి వస్తున్న పెట్టుబడులు పునరుత్పాదక శక్తికి సంబంధించిన క్లిష్టతలను పూర్తిగా తగ్గిస్తాయ‌ని తెలిపారు.

శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయ‌ని పేర్కొన్నారు. కర్బన రహిత లక్ష్యంగా, గ్రీన్‌ఎనర్జీ దిశగా అడుగులేస్తున్న భారత్‌కు తన లక్ష్య సాధనలో చక్కటి సహకారాన్ని అందిస్తాయ‌ని చెప్పారు.