485 మీటర్ల మేర దెబ్బతిన్న పోలవరం డయాఫ్రం వాల్‌

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ 485 మీటర్ల మేర నాలుగు చోట్ల దెబ్బతిన్నదని నిపుణులు తేల్చారని  జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. దెబ్బతిన్న భాగాలలో మాత్రమే మరమ్మతులు చేసుకోవచ్చని రిపోర్టును నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ ఇచ్చిందని  స్పష్టం చేశారు.  కేంద్ర బృందాలు గత కొద్ది నెలలుగా ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ విషయంపై పరిశీలనలో జరిపాయి. శనివారం 37 మందితో కూడిన వివిధ శాఖల నిపుణులు వచ్చి డయాఫ్రం వాల్‌తో సహా ప్రాజక్ట్‌ అన్ని విభాగాలు పరిశీలించారు.

కాగా, ఎగువ, దిగువ కాపర్‌ డ్యామ్‌ లను పూర్తి చేయకుండానే డయాఫ్రమ్‌ వాల్‌ కట్టడం మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదమని మంత్రి విమర్శించారు. డయాఫ్రమ్‌ వాల్‌పై వరద జలాలు ప్రవహించకుండా కాపర్‌ డ్యాంలు పూర్తిచేసిన తర్వాతే డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని వుందని,  కానీ గత ప్రభుత్వం దానికి విరుద్ధంగా పని చేసిందని ధ్వజమెత్తారు.

 కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌ ద్వారా వరద ప్రవాహానికి -22 మీటర్ల దాకా స్కవార్స్‌, పిట్స్‌ ఏర్పడ్డాయని తెలిపారు. అవి బాగు చేయకుంటే పనులు చేయడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. వీటికి రూ. 2,000 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు. దెబ్బతిన్న ప్రాంతానికి ఎంత ఖర్చవుతుందో నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పారు.

వరదలు రాకముందే వేగవంతంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రాంబాబు తెలిపారు. తొందరపాటు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లలేమని, సావధానంగా ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సీజన్లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని భావించడం లేదని స్పష్టం చేశారు.