అగ్నివీర్‌ నియామక ప్రక్రియ ప్రారంభం

భారత సైనిక దళాల్లో అగ్నివీర్‌ నియామక ప్రక్రియ ప్రారంభమయ్యిందని, విశాఖపట్నం రిక్రూట్‌మెంట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ కల్నల్‌ వినరుకుమార్‌ చెప్పారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయనగరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అగ్నివీర్‌ నియామకాల కోసం ఫిబ్రవరి 16 నుంచి ఆన్‌లైన్‌ రిజిష్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యిందని తెలిపారు.
 
 మార్చి 15వరకు రిజిష్ట్రేషన్లు చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. గత రిక్రూట్‌మెంట్‌లకు భిన్నంగా, అగ్నివీర్‌ ఎంపిక కోసం ముందుగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, నిర్ణీత తేదీల్లో నిర్వహించిన ఆన్‌లైన్‌ టెస్టు తరువాత, దానిలో ఉత్తీర్ణులైన వారికి శారీరక ధారుడ్య పరీక్షలు, వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
 
ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడలతో సహా దేశంలో మొత్తం 76 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ రాత పరీక్ష జరుగుతుందని, ఈ మార్పులను అభ్యర్ధులు గమనించాలని సూచించారు. అభ్యర్థుల వయసు 17 సంవత్సరాల 6 నెలలు నిండి, 21 ఏళ్ల లోపు ఉండాలని, ఆయా పోస్టులను బట్టి పదో తరగతి నుంచి ఇంటర్‌ ఉత్తీర్ణత, ఇతర సాంకేతిక అర్హతలు ఉండాలని చెప్పారు.
 
అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ (ఉమెన్‌ మిలటరీ పోలీస్‌), అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ 8వ తరగతి పాస్‌ మొదలగు ఆరు రకాల విభాగాల్లో రిక్రూట్‌మెంట్‌ జరుగుతోందని చెప్పారు. తొలిసారిగా మహిళలకు కూడా ఎంపిక నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్తిగా ప్రతిభ ఆధారంగా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దని కల్నల్‌ వినరు కుమార్‌ యువతను హెచ్చరించారు. 
 
జిల్లా నుంచి యువత పెద్ద ఎత్తున సైనిక దళాల్లో చేరేలా ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి చెప్పారు.  కల్నల్‌ వినరు కుమార్‌ సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఆర్మీలోకి ఎంపికల కోసం రూపొందించిన నూతన విధానం గురించి కలెక్టర్‌కు వివరించి జిల్లాలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సహకారాన్ని కోరారు.
 
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 8 వేల యువజన గ్రూపులున్నాయని, వీటిలో వున్న యువతను ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసేలా ప్రోత్సహిస్తామని కలెక్టర్ తెలిపారు. దీంతోపాటు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌పై విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆమె చెప్పారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం జిల్లాలోని 678 గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో వుంచేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.