విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వేజోన్ జూన్ 1 నుంచి ఉనికిలోకి వస్తోంది. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మే ఐదో తేదీన రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. శాశ్వత భవనాల నిర్మాణానికి భూమి కేటాయించి అప్పగించడంతోపాటు జోన్ కార్యకలాపాలను నిర్వహించడానికి (తాత్కాలికంగా) వీఎంఆర్‌డీఏకు చెందిన ‘డెక్’ భవనంలో రెండంతస్థులు కేటాయించారు.
జోన్‌కు కేటాయించిన జనరల్ మేనేజర్, ఇతర అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. తూర్పుతీరంలో కోల్‌కతా, చెన్నై మధ్య ఉన్న విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకతీతంగా సుదీర్ఘ కాలం పోరాడారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ కేంద్రంలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కానీ రైల్వే శాఖలో ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యంతో ఏళ్ల తరబడి అది కార్యరూపం దాల్చలేదు. ప్రధాని నరేంద్ర మోదీ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ వచ్చినప్పుడు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇందుకు భూములు కేటాయించలేదు. దీంతో జోన్ ఏర్పాటు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముడసర్లోవ ప్రాంతంలో భూమి కేటాయించింది. తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఆమోదానికి కొంత సమయం పట్టింది. ఎట్టకేలకు జోన్ ప్రధాన కార్యాలయ భవనాల నిర్మాణానికి గత ఏడాది జనవరిలో ప్రధాని శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో అప్పటి వరకు నగరంలో వీఎంఆర్‌డీఏకు చెందిన ‘ది డెక్’ భవనంలో తాత్కాలికంగా జోన్ ఆఫీ్‌సకు రెండు అంతస్థులను రాష్ట్రప్రభుత్వం కేటాయించింది.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సోమవారం(జూన్ 1) నుంచి అధికారికంగా ప్రారంభం కానుండటం చారిత్రాత్మక మైలు రాయిగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. దశాబ్దాల కల నెరవేరుతోందని, నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తుందని, కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు ఇది కీలక మైలురాయి అని తెలిపారు. ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం ధన్యవాదాలు తెలిపారు.

More Stories
‘పీఎం-సేతు’ ద్వారా ఏపీకి మొదటి వ్యూహాత్మక పెట్టుబడి
హథీరాంజీ మఠాధిపతి సంత్ అర్జున్‌దాస్‌కు `సుప్రీం’లో భారీ ఊరట
కాలుష్య రహితంగా ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’