ఈశాన్యంలో బీజేపీ ప్రభంజనం సూత్రధారి హిమంత బిశ్వ శర్మ

తాజాగా ఈశాన్య రాష్ట్రాలలో మూడు చోట్ల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు రాష్ట్రాలలో తిరిగి బిజెపి భాగస్వామ్యం గల కూటములే గెలుపొంది అధికారంలోకి వస్తున్నాయి. మూడో రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించకపోవడంతో బిజెపి భాగస్వామ్యంతోనే ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇప్పటికే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లలో బీజేపీ అధికారంలో ఉంది. కేవలం సిక్కిం, మిజోరాంలలో మాత్రమే ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. నేడు ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది.
 
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకప్పుడు క్షేత్రస్థాయిలో కనీసం కనిపించని పార్టీ.. ఇప్పుడు ఏకంగా అధికారంలోకి రావడం వెనుక చాలా దశాబ్దాల తరబడి సంఘ్ పరివార్ చేస్తున్న కృషి ప్రధాన కారణమైతే, రాజకీయంగా అటల్ బీహార్ వాజపేయి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడినప్పటి నుండి ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కేంద్రంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశారు.
 
ఇక 2014 నుండి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు జరుపుతున్న సుడిగాలి పర్యటనలతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఈ ప్రాంతం స్వరూపాన్నే మార్చివేశారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలు అంటే మిగిలిన దేశంతో సంబంధం లేనట్లు ఉండెడివి. ఇప్పుడు ఆ దూరం తగ్గించారు.
 
ఈశాన్య రాష్ట్రాలలో నేడు బీజేపీ ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి ప్రధాని మోదీ ఇమేజ్ వంటివి తెరపై కనిపించే కారణాలైతే, తెరవెనుక వ్యూహాత్మకంగా పావులు కదిపిన చాణక్యం అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మది అని చెప్పవచ్చు.
 
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం కావడానికి హిమంత శర్మ వ్యూహాలే ప్రధాన కారణం.  ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల వ్యూహాలు రూపొందించడం, అనూహ్యమైన ప్రత్యర్థులతో చేతులు కలపడం వంటి అంశాలలో ఆయనతో పోల్చదగిన సామర్ధ్యం దేశం మొత్తం మీద బీజేపీ నేతలలో మరెవ్వరిలో లేదని చెప్పవచ్చు.
 
అప్పటికే ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి రావడం, క్రమంగా ఆయా రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ బలం పుంజుకునేలా చూడడం హిమంత శర్మ వ్యూహాల్లో ఒకటి. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం ద్వారా బీజేపీ అగ్ర నేతల్లో ఒకరుగా హిమంత శర్మ మారిపోయారు.
 
ఇటీవల జరిగిన గుజరాత్, ఢిల్లీ ఎన్నికల్లో హిమంత శర్మ స్టార్ ప్రచారకర్తలలో ఒకరన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నికల వ్యూహాల్లో హిమంత శర్మది అందెవేసిన చేయి అని పార్టీ నేతలే చెప్పుకుంటుంటారు. ముఖ్యంగా, క్రిస్టియన్లు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హిందుత్వ ఎజెండా ప్రధానంగా ఉన్న బీజేపీని గెలిపించడం సామాన్యమైన విషయం కాదని గుర్తించాలి.

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడిన నాటినుంచి దాదాపు ప్రతీరోజు హిమంత శర్మ అస్సాం రాజధాని గువాహటి నుంచి ఈ ఈశాన్య రాష్ట్రాలకు విమానాలలో వెళ్లేవారు.  నాగాలాండ్ లో నీఫ్యూ రియోకు మద్దతిచ్చి, అధికారం పంచుకున్నా, త్రిపురలో అనూహ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్న మానిక్ సాహను పార్టీ తరఫున తెరపైకి తీసుకువచ్చినా, మేఘాలయలో తమతో పొత్తు ను వద్దనుకుని ఒంటరిగా పోటీ చేసి మెజారిటీకి దగ్గరగా వచ్చిన ఎన్పీపీ నేత కన్రాడ్ సంగ్మాని మళ్లీ తమతో పొత్తుకు సిద్ధమయ్యేలా చేసినా.. అన్నీ హిమంత శర్మ వ్యూహాల్లో భాగమే.

ఎన్పీపీకి సంపూర్ణ మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన నేపథ్యంలో, ఓట్ల లెక్కింపుకు  ముందే, రెండుసార్లు స్వయంగా గువాహటి వెళ్లి అస్సాం సీఎం హిమంత శర్మతో కన్రాడ్ సంగ్మా ప్రత్యేకంగా సమావేశమవడం గమనార్హం.  అయితే, త్రిపుర రాజవంశ ప్రతినిధికి చెందిన తిప్ర మోథాను కూడా బీజేపీ కూటమిలో చేర్చుకునేందుకు హిమంత శర్మ చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. ప్రత్యేక తిర్ప రాష్ట్రం కోసం తిప్ర మోథా గట్టిగా పట్టుబట్టడం, అందుకు బీజేపీ సిద్ధంగా లేకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.

ఎన్నికల వ్యూహాలతో పాటు బిజెపి విధానపరమైన అంశాలలో సహితం శర్మ కీలక పాత్రధారిగా మారుతున్నారు. యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి), పిఎఫ్‌ఐ నిషేధం, పశుసంరక్షణ చట్టాన్ని ఆమోదించడం, మైనారిటీ జనాభా పెరుగుదలను మందగించడానికి నిర్దిష్ట విధానపరమైన చర్యల కోసం పిలుపునిచ్చినా లేదా “అక్రమ” గ్రామాలను బుల్డోజింగ్ చేయడం వంటి అనేక అంశాలలో దేశంలోనే చురుకుగా వ్యవహరిస్తున్న బిజెపి ముఖ్యమంత్రిగా పేరొందారు. ఆయన లేవనెత్తుతున్న అంశాలు పలు రాస్త్రాలలో బిజెపి అజెండాలో భాగం అవుతున్నాయి.