నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ ఉద్ధండుడు నెయిఫియూ రియో రికార్డు స్థాయిలో అయిదోసారి ముఖ్యమంత్రి కానున్నారు. నాగాలాండ్‌లో సుదీర్ఘకాల సిఎంగా ఉంటూ వస్తున్న ఆయన వరుసగా మరో విజయంతో ఐదోసారి ఈ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
రియో సొంతపార్టీ ఎన్‌డిపిపి మిత్రపక్షం బిజెపితో కలిసి 60 స్థానాల అసెంబ్లీలో 37 స్థానాలలో విజయం సాధించింది. బీజేపీ 12 స్థానాల్లో, నేషనలిస్ట్ డెమొక్రటిక్ పార్టీ(ఎన్‌డీపీపీ) 25 స్థానాల్లో గెలిచాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రాలలో వరుసగా ఒకే పార్టీ లేదా కూటమి విజయం సాధించడం, ఏకబిగిన ఒక నేత ఐదు సార్లు సిఎం కావడం అరుదైన రికార్డు అయింది.
కాగా, నాగాలాండ్ చరిత్రలో తొలిసారిగా ఆ రాష్ట్ర శాసనసభకు ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారు. ఎన్‌డీపీపీకి చెందిన హెఖానీ జఖాలు నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె దిమపూర్-3 నియోజకవర్గం నుంచి గెలిచారు. ఎన్‌డీపీపీకే చెందిన సల్‌హుతో క్రుసె పశ్చిమ అంగామె నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
వయోవృద్ధ నేత అయిన రియో నాగాలాండ్‌లో ఇంతకు ముందు మూడుసార్లు సిఎం అయిన ఎస్‌సి జమీర్ రికార్డును బద్ధలు కొట్టారు. 1950 నవంబర్ 11న అంగామీ నాగా కుటుంబంలో జన్మించిన రియో తొలి దశ విద్యాభ్యాసం కోహిమా బాప్టిస్టు ఇంగ్లీషు స్కూల్‌లో సాగింది. తరువాత పశ్చిమ బెంగాల్‌లోని పురులియా లో ఉన్న సైనిక్ స్కూల్‌లో చదువు కొనసాగించారు. తరువాత డార్జిలింగ్‌లోని సెయింట్ జోసెఫ్ కాలేజీ, తిరిగి కోహిమా ఆర్ట్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్కూల్ దశలోనే ఆయన రియో విద్యార్థి నేతగా తన ప్రాభవం సాగించారు.
1974లో ఆయన యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ యువజన విభాగం అధ్యక్షులుగా కోహిమా జిల్లాకు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత ఏకంగా నాగాలాండ్ యువజన విభాగం అధ్యక్షులు అయ్యారు. ఇప్పటివరకు ఆయన ఎనిమిది సార్లు రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేశారు. ఇందులో 1987లో ఒక్కసారే ఓటమి పాలయిన సందర్భం ఉంది.

More Stories
బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
నౌకాదళం చీఫ్‌గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి