ఏ దేశమూ తనను తాను ‘ప్రపంచ లీడర్’నని చెప్పుకోలేదు

తమ నిర్ణయాల వల్ల, చర్యల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల మాట వినకుండా.. ఏ దేశమూ కూడా తనను తాను ‘ప్రపంచ లీడర్’నని చెప్పుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘‘మనల్ని ఏది ఏకం చేస్తుందో దానిపై దృష్టి పెట్టాలి. మనల్ని విభజించే వాటిపై కాదు’’ అని స్పష్టం చేశారు.  ఢిల్లీలో జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తూ  ‘‘ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయి. బహుళపక్షవాదం (మల్టీలేటరలిజం) నేడు సంక్షోభంలో ఉందని మనమందరం అంగీకరించాలి” అని తెలిపారు.

ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు వంటి అనుభవాలు ప్రపంచ పాలన విఫలమైందని స్పష్టం చేస్తున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు మందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ప్రపంచదేశాల మధ్య సంబంధాలు తెగిపోతున్న సమయంలో జీ20 సదస్సు జరుగుతున్నందున అన్ని దేశాలు సదస్సు వైపే చూస్తున్నాయని ఆయన చెప్పారు. ‘‘ప్రపంచ విచ్ఛిన్నం జరుగుతున్న సమయంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడు ఇక్కడ లేని వారి బాధ్యత కూడా మన మీదు ఉంది’’ అని వివరించారు.

‘‘ఏళ్ల తరబడి పురోగతి సాధించిన మనం.. ఇప్పుడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. ప్రజలకు ఆహార, ఇంధన భద్రతపై భరోసా కల్పించే ప్రయత్నాల్లో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రమైన అప్పులతో సతమతమవుతున్నాయి. సంపన్న దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఇవి ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అందుకే భారతదేశం తనకు లభించిన జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలతో దక్షిణాది దేశాల తరఫున గొంతు వినిపించడానికి ప్రయత్నిస్తోందిని ప్రధాని తెలిపారు. తీవ్రంగా ప్రభావితమైన వారి మాట  వినకుండా ఏ  బృందమూ  అంతర్జాతీయ నాయకత్వం చేపట్టటానికి తగదని కూడా ప్రధాని విస్పష్టంగా తేల్చి చెప్పారు.

  విదేశాంగ మంత్రుల చర్చల మీద ఈనాటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఉండి తీరుతుందని ప్రధాని గుర్తుచేశారు. “ఈ ఉద్రిక్తతల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మన అభిప్రాయాలు, దృక్పథాలు మనకుంటాయి” అని చెప్పారు.  అదే సమయంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ముందుకు నడుపుతున్న దేశాలుగా మనకు ఇక్కడ లేని వారి పట్ల కూడా బాధ్యత ఉందని గుర్తు చేశారు.

“ఎదుగుదల, అభివృద్ధి, ఆర్థికంగా కోలుకోవటం, విపత్తులనుంచి కోలుకోవటం, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ నేరాలు, అవినీతి, తీవ్రవాదం, ఆహార, ఇంధన భద్రతలు లాంటి కీలక సమస్యలు, సవాళ్ళ మీద జి-20 తీసుకునే నిర్ణయాలకోసం ప్రపంచం ఎదురుచూస్తోంది” అని ప్రధాని అభిప్రాయపడ్డారు.  ఈ అంశాలన్నిటిలోనూ ఏకాభిప్రాయం సాధించి స్పష్టమైన ఫలితాలు సాధించే సామర్థ్యం జి-20 కి ఉందని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు.

మనం ఉమ్మడిగా పరిష్కరించగల సమస్యలకు సాధించలేని అంశాలు అడ్డు పడకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా హితవు చెప్పారు.  గాంధీ, బుద్ధుడు జన్మించిన నేలమీద మీరు సమావేశమవుతున్నందున భారత నాగరికత అందించిన విలువలనుంచి పొందిన స్ఫూర్తిని అందరూ అందుకోవాలని ప్రధాని సూచించారు. విభజించే శక్తులమీద కాకుండా కలిపి ఉంచే వాటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

వేలాది మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన ప్రకృతి వైపరీత్యాలను, ఘోరమైన కరోనా సంక్షోభాన్ని  ప్రస్తావిస్తూ, వీటివలన అంతర్జాతీయ సరఫరా గొలుసుకట్టు విచ్ఛిన్నమైందని ప్రధాని తెలిపారు. సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థలు సైతం అకస్మాత్తుగా రుణాల సుడిగుండంలో చిక్కుకొని ఆర్థిక సంక్షోభంలో పడటాన్ని ప్రధాని గుర్తు చేశారు.

అందుకే మన సమాజాలు, మన ఆర్థిక వ్యవస్థలు, మన ఆరోగ్య వ్యవస్థలు, మన మౌలిక సదుపాయాలు మళ్ళీ వేగంగా కోలుకోవాలని ఈ అనుభవాలు మనకు స్పష్టంగా సూచిస్తున్నాయని చెప్పారు. ఒకవైపు ఎదుగుదలకూ, సామర్థ్యానికీ మధ్యన సరైన సమతుల్యత సాధిస్తూ  ఇంకోవైపు కోలుకోవటం మీద దృష్టి సారిస్తూ జి-20 ఒక కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని సూచించారు. కలసికట్టుగా పని చేయడం ద్వారా మనం ఈ సమతుల్యత సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.