త్రిపుర, నాగాలాండ్ లలో బీజేపీ ప్రభుత్వాలు.. మేఘాలయలో హాంగ్

మూడు ఈశాన్య రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బిజెపి హవా కొనసాగింది. త్రిపుర, నాగాలాండ్ లలో బీజేపీ భాగస్వామిగా గల కూటములు తిరిగి ఆధిక్యత సంపాదించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతుండగా, మేఘాలయాలో ఎవ్వరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దానితో ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ కీలకంగా మారే అవకాశం ఏర్పడింది. ఫిబ్రవరి 27 పోలింగ్ జరుగగా గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది.
 
 ఈశాన్య భారతదేశంలో ఇప్పటికే అసోం, మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి త్రిపురలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు బీజేపీకి సకారాత్మకమైనవని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని ఎవరూ నిరాకరించలేరని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి వెలుగులను చూస్తున్నాయని పేర్కొన్నారు. మేఘాలయలో ఎన్‌పీపీతో పొత్తు అవకాశాలను తోసిపుచ్చలేమని తెలిపారు.
మొత్తం 60 స్థానాలున్న త్రిపురలో బీజేపీ 33 చోట్ల విజయం సాధించి, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని దక్కించుకుంది. 2018 వరకూ త్రిపురను ఏలిన వామపక్షాలు ఈసారీ ప్రతిపక్షానికే పరిమితమయ్యాయి. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసినాకమ్యూనిస్టులు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఫలితాల్లో మాత్రం వెనుకబడ్డారు. కాంగ్రెస్‌- వామపక్ష కూటమి 14 సీట్లలో మాత్రమే గెలుపొందింది. కొత్తగా ఏర్పడిన తిప్రా మోథా పార్టీ 13 స్థానాల్లో గెలిచి తన ఉనికి చాటుకుంది.
తిప్రా మోథా మిగతా పార్టీలకు ముఖ్యంగా వామపక్ష కూటమికి భారీగానే నష్టం కలిగించింది. దాదాపు 20 సీట్లలో ఇతర పార్టీల అవకాశాల్ని దెబ్బతీసింది. మొత్తం 60 సీట్లలో 42 చోట్ల పోటీ చేసిన తిప్రా మోథా కూటమి ప్రత్యేక తిప్రా ల్యాండ్ డిమాండ్‌తో ముందుకెళ్లింది. అయితే అటు అధికార బీజేపీ కానీ, విపక్షాలు లెఫ్ట్, కాంగ్రెస్ కానీ ఈ డిమాండ్‌ను పట్టించుకోలేదు.
 
బీజేపీ సుపరిపాలన, అభివృద్ధి పేరుతోనే ఎన్నికలకు వెళ్లింది. కానీ 16 గిరిజన సీట్లలో బలమున్న తిప్రా మోథా.. అధినేత ప్రద్యోత్ దేవ్ వర్మ దూకుడు కారణంగా మరికొన్ని చోట్ల కూడా లెఫ్ట్ కూటమి అవకాశాల్ని దెబ్బతీసింది. అలాగే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఐపీఎఫ్టీ ఆశలపై కూడా నీళ్లు చల్లింది. గత ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిన ఐపీఎఫ్టీ ఈసారి ఒక్క సీటుకే పరిమితమైంది.
 
నాగాలాండ్‌‌లోనూ ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి
 
నాగాలాండ్‌‌లోనూ ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 38 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఎన్‌పీపీ 2, ఎన్‌పీఎఫ్‌ 2 చోట్ల గెలుపొందగా.. ఇతరులు 16 సీట్లలో విజయం సాధించారు. కాంగ్రెస్ ఇక్కడ కనీసం ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం. నాగాలాండ్ ఎన్నికలు సరికొత్త రికార్డు సృష్టించాయి. తొలిసారి మహిళలు అసెంబ్లీలో కాలుమోపనున్నారు.
 
ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హెకానీ జఖాలు  రికార్డు నెలకొల్పారు. తర్వాత కొద్దిసేపటికే సల్హౌతునొ క్రుసె విజయం సాధించారు. వీరిద్దరూ నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దిమాపుర్ ‌నుంచి హెకానీ, పశ్చిమ అంగామీ  నుంచి క్రుసె జయకేతనం ఎగురవేశారు.
 
మేఘాలయాలో హంగ్
మేఘాలయలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఏ పార్టీ సాధారణ మెజార్టీకి అవసరమైన 30 స్థానాలను గెలుపొందలేకపోయింది. ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ 27 సీట్లకు పరిమితమై సాధారణ మెజార్టీకి నాలుగు అడుగుల దూరంలో ఆగిపోయింది. బిజెపి కేవలం 4 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక, తృణమూల్ కాంగ్రెస్ 5, కాంగ్రెస్‌ 4, ఇతరులు 21 సీట్లలో విజయం సాధించారు