తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

ఆహార కొరత, ఇంధన కొరత, ఎరువుల కొరత తీవ్రమయ్యే ముప్పు ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని మోదీ గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభ పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా భారత ప్రధాని మోదీని, ఇటలీ ప్రధాని మెలోనీ  కోరారు.

జీ 20 అధ్యక్ష దేశంగా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత్ కీలక భూమిక పోషంచాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని నిలిపివేసి, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు అంతర్జాతీయంగా జరిగే ప్రక్రియలో పాలు పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్ ఒకే మాటపై ఉందని తెలిపారు. దౌత్య మార్గాలు ద్వారా, చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని, యుద్ధం పరిష్కార మార్గం కాదని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. జీ 20 విదేశాంగ మంత్రుల సదస్సు ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారత్‌లో ప్రతీ ఏటా జరిగే నిర్వహించే బహుపాక్షిక సదస్సు రైసినా డైలాగ్ ఎనిమిదో ఎడిషన్‌కు హాజరయ్యేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని గురువారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సంరద్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జార్జియకు రాష్ట్రపతి భవన్ వద్ద స్వాగతం పలికారు. గత భారత్ లో పర్యటించిన ఐదేళ్లలో యూరోపియన్‌ దేశానికి చెందిన తొలి అగ్రనాయకురాలుగా జార్జియా నిలిచింది.

కాగా, ఈ సందర్భంగా మాట్లాడిన జార్జియా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజామోదం కలిగిన నాయకుడిగా నిలిచిన మోదీకి జార్జియా మెలోని శుభాకాంక్షలు తెలిపారు. ఇది మోదీ నాయకత్వం ప్రతిభకు నిదర్శమని పేర్కొంటూ రెండు దేశాలు కలిస్తే మరెన్నో అద్భుతాలు చేయొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఎనిమిదవ రైసినా డైలాగ్ ప్రారంభ సెషన్‌లో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ముఖ్య అతిథి, ముఖ్య వక్తగా పాల్గొంటారు.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో మార్చి 2-4 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో 100 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ పర్యటన భారత్, ఇటలీల మధ్య చిరకాల బంధాన్ని మరింత పటిష్టం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.