అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం యుద్ధం

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో స్పందిస్తూ అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం యుద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.  ‘‘అవినీతికి పాల్పడే వారు ఎవరైనా కానీ, పార్టీలతో సంబంధం లేకుండా విడిచి పెట్టం. నిందితుడు, అతడితోపాటు పట్టుబడిన డబ్బుపై లోతైన దర్యాప్తు చేస్తాం” అని ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ ను విమర్శించారు. అవినీతి అభియోగాల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న సమయంలో లోకాయుక్తను రద్దు చేసినట్టు బొమ్మై ఆరోపించారు. చెన్నగిరి బిజెపి ఎమ్మెల్యే కె.మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్‌ తన తండ్రి కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం గమనార్హం.

 దీనిపై సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ తన హయాంలో లోకాయుక్తను మూసివేస్తే తాము అధికారంలోకి వచ్చాక తిరిగి తెరిచామని గుర్తు చేశారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు తప్పించుకున్నారని పేర్కొంటూ  తమది  అవినీతికి వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటం అని వివరించారు.

చెన్నగిరి బిజెపి ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్‌ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తాజాగా ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా రూ.6 కోట్లు దొరికాయి. అంతకుముందు ప్రశాంక్ మదల్ టేబుల్‌పై కుప్పలుగా పోసిన నగదుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

దాంతో పాటు ఆయన కార్యాలయం నుంచి రూ.1.7 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కర్ణాటక లోకాయుక్త తెలిపింది. సబ్బులు, ఇతర డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడిసరుకు డీల్‌ ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ నుంచి ప్రశాంత్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్టు తెలుస్తోంది.