గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

సోనియా గాంధీని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఛెస్ట్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది.  జ్వరం, శ్వాస సంబంధిత సమస్యతో సోనియా బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం కూడా ఆమె అస్వస్థతకు గురి కాగా గంగారామ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందారు.

కరోనా తర్వాత తలెత్తిన పలు సమస్యలతో సోనియా గాంధీ   బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆమె కొన్నిరోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో వాతావరణ మార్పుల కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ పార్టీ 85ప్లీనరీ వేడుకల్లో సోనియా గాంధీ రాజకీయాల నుండి నిష్క్రమించనున్నట్లు   పరోక్షంగా సంకేతం ఇచ్చారు.