భైంసాలో మార్చి 5న ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి

నిర్మల్ జిల్లా భైంసాలో మార్చి 5వ తేదీన ర్యాలీ నిర్వహించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు తెలంగాణ హైకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. బైంసాలో ఆర్ఎస్ఎస్ మార్చ్‌కు కొన్ని షరతులతో కూడిన అనుమతినిచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది.
 
500 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనాలని సూచించింది. మసీదుకు 300 మీటర్ల దూరంలో ర్యాలీ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేనివారు మాత్రమే ర్యాలీలో పాల్గొనాలని ఆదేశించింది. మసీదు దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, ర్యాలీలో పాల్గొనేవారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది.

భైంసాలో మార్చి 5న ఆర్ఎస్ఎస్ మార్చ్‌కి అనుమతినివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగర శారీరకోత్సవం పేరుతో ర్యాలీకి ఆర్ఎస్ఎస్ ప్రణాళిక చేసింది. ఇటీవల శివాజీ జయంతి నాడు చేద్దామనుకున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టులో అర్ఎస్ఎస్ పిటిషన్ వేసింది. మార్చి 5న ర్యాలీ చేసేందుకు పోలీసులు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన బైంసా పోలీసులు ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అనుమతి నిరాకరించినట్లు హైకోర్టుకు తెలిపారు. ఇంటెలిజెన్స్ నివేదికను హైకోర్టుకు సమర్పించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది రెండు సంవత్సరాల క్రితం బైంసాలో జరిగిన మత ఘర్షణలు వలన ప్రాణ నష్టం జరిగిందని కోర్టుకు వివరించారు.

భైంసా అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతమని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు బలంగా వినిపించారు. టిప్పు సుల్తాన్ పుట్టినరోజు ర్యాలీకు సైతం పోలీసులు అనుమతి ఇచ్చిన భైంసా పోలీసులు, ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి నిరాకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.

బైంసా భారత దేశంలోనే ఉందని, వెలుపల ప్రాంతం కాదని పేర్కొంటూ ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని వాదనలు వినిపించారు. వాద, ప్రతివాదనలు విన్న హైకోర్టు బైంసా ఆర్ఎస్ఎస్ మార్చ్‌కు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.