‘హర్ ఘర్ కమల్’ నినాదంతో తెలంగాణాలో ప్రతి ఇంటికి బీజేపీ ఎన్నికల గుర్తు

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.  ఒక వేళ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్రాధాన్యత ఇస్తే  ఏవిధంగా ఎదుర్కోవాలనే దానిపై బీజేపీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నేతలను అప్రమత్తం చేస్తూ మంగళవారం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో  కేంద్ర మంత్రి అమిత్‌ షా  తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో భేటీ నిర్వహించారు.

ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సాల్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,  ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపిలు డాక్టర్ కె. లక్ష్మణ్, అరవింద్, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్, మాజీ ఎంఎల్‌ఎ నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపి వివేక్, విజయశాంతి సహా మొత్తం 15 మంది నేతలు పాల్గొన్నారు.

మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో బీజేపీ  భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యూహాలపై నేతలు చర్చించారు.  ‘హర్ ఘర్ కమల్’ నినాదంతో పార్టీ ఎన్నికల గుర్తును ప్రతి ఇంటికి చేరువ చేసే దిశగా కార్యక్రమాలు ఉండాలని అధిష్టానం సూచించినట్లు సమావేశం అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.

కేవలం బీజేపీ వ్యవహారాలకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు కావడం… ఈ కేసులో తర్వాత అరెస్టు అయ్యేది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అని వినవస్తున్న నేపథ్యంలో షా, నడ్డాలతో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భేటీలో దిశా నిర్దేశం చేసినట్లు చెబుతూ రాష్ట్రంలో పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లటమే తమ లక్ష్యమని, ఆ విషయాలనే సమావేశంలో చర్చించామని సంజయ్  వివరించారు. అది అత్యవసర సమావేశం ఏం కాదని.. రొటీన్ మీటింగ్ అని వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని పేర్కొంటూ మెుత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించామని.. పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లటమే తమ లక్ష్యమని చెప్పారు.

నెలరోజుల పాటు ర్యాలీలు, సభలు

ఇందులో భాగంగానే   తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్చ్ లో నెల రోజుల పాటు  బీజేపీ అగ్రనేతలు ర్యాలీలు, సభలు  నిర్వహించనున్నారు.  బీజేపీ భరోసా, ప్రజాగోస పేరుతో  119 నియోజకవర్గాల్లో  ర్యాలీలు.. వీటితో పాటు  కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా బీజేపీ సీనియర్ నేతలు  రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10 భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో  హైదరాబాద్ లో  ముగింపు సభ నిర్వహించనున్నారు. 

ఈ నెల రోజుల ప్రచారంలో బీజేపీ నాయకులు, నేతలు బీఆర్ఎస్ వైఫల్యాలను, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఉన్న సంబంధంను హైలెట్ చేయనున్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని చెబుతూ తెలంగాణ భవిష్యత్తు గురించే చర్చ జరిగిందని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ విముక్తిని కోరుటుంటున్నారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో చర్చించామని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బూత్ స్థాయి వరకు పనిచేస్తున్నామని సంజయ్ తెలిపారు. ప్రజాగోస, బీజేపీ భరోసా, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తో ప్ర‌జ‌ల ముందుకు వెళ్తున్నామ‌ని చెబుతూ వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం త‌ధ్య‌మంటూ థీమా వ్య‌క్తం చేశారు.

కాగా, లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తే స్పందించిన కేసీఆర్ ఆయ‌న కుమార్తె కవితకు సీబీఐ నోటీసులిస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. లిక్కర్ కేసులో కవితకు సంబంధాలు ఉన్నాయని సీబీఐ ఛార్జిషీటులో నాలుగు సార్లు పేర్కొందని ఆయన గుర్తు చేశారు. అవినీతి పనులు చేస్తే చట్టానికి ఎవరూ అతీతం కాదని స్పష్టం చేశారు.