ప్రీతి ఆరోగ్యంపై తప్పుడు నివేదిక… గవర్నర్ ఆగ్రహం

మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిని కాపాడేందుకు మొదట ఆమె ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు సమాచారం ఇచ్చారని కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్  డా. తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు వ్రాసిన లేఖలో ర్యాగింగ్, వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రీతి వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్  స్పష్టం చేశారు.
 
ప్రీతిని వరంగల్ ఎంజీఎం నుంచి నిమ్స్ కు తరలించడంతో ఎంతో విలువైన సమయం కోల్పోయినట్టయిందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. అలా కాకుండా, ప్రీతిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనే ఉంచి, హైదరాబాద్ నుంచి నిపుణులైన వైద్యులను, వైద్య పరికరాలను అక్కడికే తరలించి ఉంటే బాగుండేదని ఆమె పేర్కొన్నారు. ఇక, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ లు, వేధింపులకు సంబంధించిన ఎస్ఓపీలపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని కాళోజీ వర్సిటీని రాసిన లేఖలో ఆమె ఆదేశించారు. వైద్య కళాశాల్లో మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటల వివరాలతో పాటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలని ఆమె స్పష్టం చేశారు.

మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ఇలాంటి ఘటనల్లో ఉదాసీనంగా వ్యవహరించకుండా తక్షణం స్పందించి కఠినచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గవర్నర్ సూచించారు. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబంధించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలని చెప్పారు. మహిళా మెడికోలకు కౌన్సెలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న ప్రీతి అధికమొత్తంలో మత్తుమందు తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆమెను తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడ్నించి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. అయితే నిమ్స్ వైద్య నిపుణులు తీవ్రంగా శ్రమించినా ప్రీతిని బతికించలేకపోయారు.