మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన డా. ప్రీతి

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి చనిపోయింంది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరికి ప్రాణాలు కోల్పోయింది. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆదివారం సాయంత్రం  9 గంటల 10 నిమిషాలకు బ్రెయిన్‌ డెడ్‌తో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.  

శాయా శక్తులా ప్రయత్నించినా ప్రీతిని కాపాడలేకపోయామంటూ నిమ్స్ వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతిని బతికించేందుకు అన్ని విధాలుగా వైద్యులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వరంగల్ కేఎంసీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని ఈ నెల 21 పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని అత్మహత్యకు యత్నించింది.

 
అయితే.. అప్పుడే మల్టి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కాగా మొదటి రోజు నుంచే ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తూ వస్తున్నారు. ఆమెను బ్రతికించేందుకు వైద్య బృందం అన్ని విధాలుగా కృషి చేసింది. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఏ రోజుకారోజు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తున్నారు. మొదట ఎంజీఎంలో వైద్యం అందించగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.
 
అయితే శనివారం వరకు నొప్పికి స్పందించిన ప్రీతిలో ఆదివారం ఎలాంటి స్పందన కన్పించట్లేదని తెలిపారు. ప్రీతికి బెయిన్ డెడ్ అయినట్టు చెప్పారని ప్రీతి తండ్రి తెలిపారు. . అటు ప్రీతి మరణ వార్త విని తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. స్నేహితురాలు మృతితో  కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు విలపిస్తున్నారు. 
 
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ముండ్రాయి గ్రామపంచాయతీ పరిధిలోని గిర్నితండా ప్రీతి స్వగ్రామం. ప్రీతి నవంబర్ 21న కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా డిపార్ట్‌మెంట్లో మొదటి సంవత్సరంలో జాయిన్ అయింది. మూడు నెలలుగా విధులు నిర్వహించింది. ఈ నెల 18న సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడని ప్రీతీ తల్లిదండ్రులకు చెప్పింది.
 
తండ్రి నరేందర్ హైదరాబాద్‌లో ఏఎస్సై‌గా విధులు నిర్వర్తిస్తుండటంతో.. తనకున్న పరిచయాలతో పోలీస్ అధికారితో ఫోన్ ద్వరా ప్రిన్సిపాల్‌కు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఈ నెల 20న ప్రీతిని వేధించిన సైఫ్‌కు కేఎంసి హెచ్‌ఓడీ మహిళా ప్రొఫెసర్లతో కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రీతి ఆత్మహత్య యత్నం చేసుకున్న రోజు నైట్ డ్యూటీలో ఉంది. తెల్లవారు జామున 3 గంటల వరకు విధులు నిర్వహించింది.
 
న్యాయవిచారణకు ఈటెల డిమాండ్
 
ఇలా ఉండగా, నిమ్స్‌లో పీజీ డాక్టర్‌ ప్రీతికి సరైన వైద్యం అందడం లేదని ఆరోపిస్తూ ప్రీతి ఘటనపై న్యాయ విచారణ జరపాలని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నిమ్స్‌కు వెళ్లిన ఆయన ప్రీతి తల్లిదండ్రుల్ని పరామర్శించి, ఆమె ఆరోగ్యస్థితిపై వైద్యులను ఆరా తీశారు.
 
పైఅధికారులు ప్రీతి హారస్మెంట్‌ గురించి చెప్పినపుడు స్పందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. మరోవైపు పోలీసులు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. మెడికల్‌ యూజీ.. పీజీ కాలేజీల్లో ర్యాగింగ్‌ జరుగుతూనే ఉందని చెబుతూ రాష్ట్రంలో సరిపడా వైద్యులు లేకపోవడంతో భారమంతా పీజీ విద్యార్థులపైనే పడుతోందని ఆయన చెప్పారు. ప్రీతి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా భావించాలని హితవు చెప్పారు. 
 
కాగా, ప్రీతి ఇంజెక్షన్ తీసుకున్నది అనేది కట్టుకథే అని ప్రభుత్వ వైద్య అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఎవరో స్క్రిప్ట్ రాస్తే ఇక్కడ చదువుతున్నారని మండిపడ్డారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితురాలు, ఆమె తండ్రి ఫిర్యాదు చేసినా.. అడ్మిస్ట్రషన్, హెచ్ఓడీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.