వేదింపులు తట్టుకోలేక వరంగల్ లో మరో విద్యార్థిని ఆత్మహత్య

సీనియర్ వేదింపులు తట్టుకోలేక మెడికల్ స్టూడెంట్ ప్రీతీ ఆత్మహత్య చేసుకున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుండగా, ఇప్పుడు మరో విద్యార్థిని ప్రేమ పేరుతో వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం సంచలంగా మారింది.

జయశంకర్ భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కూతురు రక్షిత(21) నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ థర్డ్ ఇయర్ చదువుతోంది. తన క్లాస్​మేట్​తో కలిసి ఉన్న ఫొటోలను తోటి స్టూడెంట్లు సోషల్‍ మీడియాలో పోస్ట్​ చేయడంతో కలత చెందిన రక్షిత ఆదివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

 పాఠశాల రోజులనుండి ఆమెకు పరిచయమైన రాహుల్‌ కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ప్రేమించకపోతే ఫోటోలు సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఇదే విషయాన్ని రక్షిత తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో యువకుడికి పోలీసులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా రాహుల్‌లో ఏ మార్పు లేదు.

కొంతకాలం మౌనంగా  ఉన్న రాహుల్ దగ్గర నుంచి మళ్లీ అవే బెదిరింపులొచ్చాయి. అదే సమయంలో రక్షిత మరో విద్యార్ధితో కలిసి దిగిన ఫొటోలు సోషల్‍ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రక్షిత వరంగల్లోని తన బంధువుల ఇంటికొచ్చింది. అక్కడే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అంతకుముందే రాహుల్ వేధింపులు ఎక్కువవ్వడంతో హాస్టల్‌లో ఉండలేనంటూ రక్షిత తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంధువుల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. ఆదివారం బంధువుల ఇంట్లోనే ఉన్న రక్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు రక్షిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకి తరలించారు. ఇక కేసులో రాహుల్ ను భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంజయ్ దిగ్బ్రాంతి

కాగా, మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త నుండి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ర్యాగింగ్ కు బలికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో ఆడపిల్లల భవిష్యత్ కు గ్యారంటీ లేదని ఆరోపించారు.

కేసీఆర్ పాలనలో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు కళ్లముందే చస్తున్నా స్పందించకపోవడం మానవత్వానికే కళంకమని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అసవరం మనందరిపైనా ఉందని స్పష్టం చేశారు.