కొండగట్టు ఆలయంలోభారీ చోరీకి భద్రతా వైఫల్యమే కారణం!

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 16 అర్ధరాత్రి జరిగిన భారీ చోరీకి భద్రతా వైఫల్యమే కారణంగా స్పష్టం అవుతుంది. ఇంత పెద్ద ఆలయానికి కనీస రక్షణ చర్యలు కల్పించకపోవడం పూర్తిగా అధికారుల వైఫల్యమే అని ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  రాత్రి స్వామి వారి సేవ అనంతరం ప్రధాన ద్వారాలకు ఆలయ అర్చకులు తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవలు చేసేందుకు గుడికి వెళ్లిన ఆలయ అర్చకులు గుడి తలుపులు తెరిచి చూసే వరకు చోరీ జరిగినట్టు గుర్తించారు. ఆలయంలోని సుమారు 15 కిలోల వెండి ఆభరణాలు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు.

వాటిలో స్వామి వారి రెండు కిలోల వెండి మకర తోరణం, అర్థమండపంలోని 5 కిలోల ఆంజనేయ స్వామి వెండి ఫ్రేమ్, నాలుగు కిలోల శత వాటిలో స్వామి వారి రెండు కిలోల వెండి మకర తోరణం, అర్థమండపంలోని 5 కిలోల ఆంజనేయ స్వామి వెండి ఫ్రేమ్, నాలుగు కిలోల శత గోపాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 15 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటించిన పది రోజుల వ్యవధిలోనే భారీ చోరీ జరగడం గమనార్హం. పోలీసుల పహారాతో పాటు ప్రత్యేక సెక్యూరిటీ ఉన్న గుడి వద్దనే ఇలా దొంగతనం జరగడం బందోబస్తు తీరును వేలెత్తి చూపుతోంది. గుట్ట వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ ఔటో పోస్ట్ లో రోజూ ఓ ఏఎస్సైతో పాటు 12 మంది హోంగార్డులు, ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నియమితులైన మరో 14 మంది సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తుంటారు.

వీరి వేతనాల కింద దాదాపు రూ. 60 లక్షలు వెచ్చిస్తున్నారు. పరిసరాల్లో ఏర్పాటు చేసిన 60కి పైగా సీసీ కెమెరాలను పర్యవేక్షించడానికి ఆలయం ముందు భాగంలోని దుకాణ భవన సముదాయంలో తెరను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను మల్యాల ఠాణాతో పాటు హైదరాబాద్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించినప్పటికీ చోరీ జరగడం గమనార్హం.

ఔట్ పోస్ట్ కు కూతవేటు దూరంలోనే ఉన్న గర్భాలయంలోకి ఆగంతకులు వెళ్లి.. పెద్ద ఎత్తున వెండి వస్తువులను దొంగలించడం ఉదయం వరకు అక్కడున్న భద్రతా సిబ్బంది పసిగట్టలేకపోయారు. రక్షణ సిబ్బంది రాత్రి వేళల్లో ఆలయ పరిసరాల్లో గస్తీ నిర్వహించకపోవడం, అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని స్పష్టం అవుతుంది.

రాత్రి 9 గంటలు దాటితే రక్షణ సిబ్బంది నిఘా మరచి నిద్రలోకి జారుకుంటారని, ఆలయ సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉండరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అదునుగా భావించి పక్కా ప్రణాళిక ప్రకారం చోరీ చేసినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడ, ధర్మపురి క్షేత్రాల వద్ద కూడా గస్తీని పెంచాల్సిన అవసరముందని భావిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో చోరీల సంఖ్య ఏటా పెరుగుతున్నాయి. జరుగుతున్న దొంగతనాల్లో దాదాపు 20 శాతం దేవాలయాల్లోనే జరగడం గమనార్హం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలతో పాటు ఇతర గుడులను దొంగలు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 ఆలయాల్లో చోరీలు జరిగాయి. 2022వ సంవత్సరంలో జగిత్యాల జిల్లాలో మాత్రం ఈ బెడద అధికంగా ఉండటం గమనార్హం.

భద్రతా వైఫల్యాలను గుర్తించి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొనే ప్రయత్నం చేయడం లేదు. చోరీ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేయకుండా తు తూ మంత్రంగా నైట్ వాచ్ మెన్ శంకర్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. దేవాలయ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కి మెమో ఇచ్చి సరిపెట్టుకున్నారు.