ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదు, హత్యా యత్నం!

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికిది కాదని, తన కూతురిపై హత్యాయత్నం జరిగి ఉండొచ్చని ఆమె తండ్రి తాజాగా సంచలన ఆరోపణ చేశారు. ప్రీతి ఆడియోలను వింటుంటే ఆమెను ఎంతగా వేధించారో అర్థమవుతుందని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
తమతో ప్రీతి మాట్లాడిన తర్వాత హత్యాయత్నం జరిగి ఉండొచ్చని తండ్రి నరేందర్ తెలిపారు. తనతో ఫోన్‌ కాల్‌లో మాట్లాడే సమయంలో కూడా భయంతో ప్రీతి ఉందని, తనను ఏదో చేస్తారనే అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు. సైఫ్ వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, చాలామందిని ఇలాగే వేధిస్తున్నట్లు తనతో చెప్పిందని నరేందర్ తాజాగా పేర్కొన్నారు.

ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో కాల్ బయటకు లీక్ అయిన నేపథ్యంలో.. తండ్రి నరేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హత్యాయత్నం అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని కొంతమంది సూచిస్తున్నారు.ఆత్మహత్యకు పాల్పడే ముందు రోజు సైఫ్ వేధింపులపై ఆమె తన తల్లితో మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఫోన్ కాల్లో తన బాధను తల్లితో  ప్రీతి చెప్పుకుంది.

 
ఒక వేళ తాను సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి తనను దూరం పెడతారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.  సైఫ్‌పై మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తాను అని చెప్పి ప్రీతి తల్లీ నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది, తమ విభాగాధిపతి డా. నాగార్జున రెడ్డి ఏదైనా ఉంటే తన దగ్గరికి రావాలి కానీ.. ప్రిన్సిపాల్‎కి ఎందుకు ఫిర్యాదు చేసావని అంటూ తనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రీతి తల్లితో చెప్పుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఇక అన్ని దారులు మూసుకుపోవడంతో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తల్లి వెల్లడించింది. ‘ఇప్పటికే సైఫ్‌పై నాన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రిన్సిపాల్ పిలిచి నన్ను అడిగాడు. చదువుకోవాలంటే భయమేస్తోంది అమ్మ’ అని ప్రీతి చెప్పగా.. చదవుపై దృష్టి పెట్టాలని, సైఫ్ ఏం చేయలేడని ప్రీతికి తల్లి ధైర్యం చెప్పినట్లు ఈ ఆడియోలో ఉంది.
 
ప్రస్తుతం నిమ్స్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు అంటున్నారు. ఇప్పటివరకు ఆమె గుండె ఆరు సార్లు ఆగిందని, సీపీఆర్ చేసి గుండె పనిచేసేలా చేశామని వైద్యులు తెలిపారు. 4 రోజులుగా  ఐదుగురు వైద్యుల బృందం వెంటిలేటర్, ఎక్మో యంత్రంతో చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.