ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలకు సీఎస్ ఆదేశం

మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలో కీలకమైన అధికారిగా వెలుగొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్య తీసుకునేందుకు రంగం సిద్దమైంది. కేంద్ర హోంశా ఆదేశాలతో సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సునీల్ కుమార్ పై తగిన చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని డీజీపీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
 
హిందూత్వానికి వ్యతిరేకంగా, హిందూ దేవతలకు వ్యతిరేకంగా సునీల్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారని మొదటగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేంద్రానికి లేఖ రాశారు. దానిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టు న్యాయవాది కూడా ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. దీంతో ఏపీ ప్రభుత్వం స్పందించక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలకు సిద్ధమైంది. కేంద్రం ఆదేశాల మేరకు సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన నివేదికను కూడా ఇవ్వాలని డీజీపీకి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచే ప్రతిపక్షాలు సునీల్ కుమార్ పై ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీ సీఐడీ డీజీగా సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని ఆయనపై రఘురాం కృష్ణంరాజు చేసిన ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ పెద్దగా పట్టించకోలేదు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 23వ తేదీన బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఏపీ సీఐడీ చీఫ్ గా సంజయ్ ను నియమించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్ కు సీఐడీ బాధ్యతలను అప్పగించింది. ఏపీ సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను ఆకస్మికంగా తప్పించడం చర్చకు దారి తీసింది. ఇప్పుడు నేరుగా చర్యలకు సిద్దమవ్వడంతో ఏం జరుగుతోందనే ఉత్కంఠ పెరిగింది.