విజయవాడ నుంచి షిర్డీకి విమాన సర్వీసులు

విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ విమాన సర్వీసులను నడిపేందుకు ఇప్పటికే షెడ్యూల్ ని కూడా ప్రకటించింది. మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

ప్రతి రోజూ మధ్యాహ్నం 12:25 గంటలకు గన్నవరం విమానాశ్రయం 72 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఏటీఆర్ 72-600 విమానం బయలుదేరి మధ్యాహ్నాం 3 గంటలకు షిర్డీ చేరుకుంటుంది. ఇప్పటిదాకా రోడ్డు,రైలు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణం చేసి షిర్డీ  వెళ్తున్నవారికి ఈ విమాన సర్వీసుల ప్రారంభం గుెడ్ న్యూస్ కానుంది.

విజయవాడ నుంచి షిర్డీకి 2:50 గంటల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నం 2:20 గంటలకు బయల్దేరి సాయంత్రం 4:35 గంటలకు గన్నవరం చేరుకుంటుందని  ఇండిగో ఎయిర్ లైన్స్ వర్గాలు తెలిపాయి. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్ ధర రూ. 4,246,అలాగే షిర్డీ నుంచి విజయవాడకి ప్రారంభ టిక్కెట్ ధర రూ.4,639గా నిర్ణయించారు.

కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ ప్రెస్ వే

మరోవైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలో ఉన్న అద్దంకి – నార్కెట్ పల్లి జాతీయ రహదారిని ఇక కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ ప్రెస్ వేగా పిలువనున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి అందించిన సేవలు, చేసిన అభివృద్దిని గుర్తించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచేందుకు అద్దంకి – నార్కెట్ పల్లి హైవేకి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ ప్రెస్ వేగా నామకరణం చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

కాగా, తన తాత గారి పేరు కీలకకమైన,నిత్యం రద్దీగా ఉండే అద్దంకి-నార్కెట్ పల్లి హైవేకి పెట్టడంపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 212 కలోమీటర్లు ఉన్న ఈ హైవేకి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ ప్రెస్ వేగా నామకరణం చేయడంపై పల్నాడు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.