అయ్యన్నపాత్రుడికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గతంలో అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఫోర్జరీ కేసులో దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్షన్‌ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయొచ్చని ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
 
జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలోని ఇంటి నిర్మాణానికి సంబంధించి ఫోర్జరీ ఎన్‌వోసీ పత్రాలను ప్రభుత్వానికి సమర్పించారని కేసు నమోదైంది. దీంతో సీఐడీ అధికారులు అయ్యన్నతో పాటూ చిన్న కుమారుడు రాజేష్‌ను అరెస్ట్ చేయగా బెయిల్‌పై విడుదల అయ్యారు.
 
అయ్యన్నపాత్రుడు రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌ హైకోర్టును ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసు కొట్టేయాలని, అలాగే బెయిలు మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు అయ్యన్నపాత్రుడిపై నమోదు చేసిన 467 సెక్షన్ చెల్లదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ కింద ఆయనకు నోటీసులు ఇచ్చి సీఐడీ విచారణ చేపట్టొచ్చని, అయ్యన్నకూడా సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే ఆ తర్వాత ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరగా.. కోర్టు హైకోర్టు తీర్పును కొట్టివేసింది.
ఫోర్జరీ సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని ఉత్తర్వులను జారీ చేసింది. సెక్షన్ 41 సీఆర్పీసీ ప్రకారం విచారణ కొనసాగాలని ఆదేశించింది. విచార‌ణ పూర్తి అయ్యేంత‌వ‌ర‌కు అయ్య‌న్న‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని సూచించింది..