యుపిలో మాఫియాను మట్టిలో కలిపేస్తాం

‘మాఫియాను మట్టిలో కలిపేస్తాం’ అని ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాలలో శనివారం రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పై ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. 

2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్‌ పాల్‌, అతడి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిని శుక్రవారం పట్టపగలు ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపడంపై విపక్షాలు మండిపడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మధ్య ఈ విషయమై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. మాఫియాకు సమాజ్‌వాదీ పార్టీ అండదండలు అందిస్తోందని యోగి ఆరోపించారు.

అఖిలేష్‌ యాదవ్‌ వైపు వేలు చూపుతూ ‘బాధితురాలి కుటుంబం ఆరోపించిన అతిక్ అహ్మద్, సమాజ్ వాదీ పార్టీ పెంచి పోషిస్తున్న మాఫియాలో భాగం కాదా?’ అని ప్రశ్నించారు. ఆ మాఫియా వెన్ను విరిచేందుకు మేం కృషి చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.  అలాగే అఖిలేష్‌ వైపు వేలు చూపుతూ.. ‘స్పీకర్ సార్, అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ ఫాదర్ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. ఈ రోజు నేను ఈ సభకు చెబుతున్నా.. ఈ మాఫియాను మట్టి కరిపిస్తా’ అని ఉద్వేగంతో యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు.

రాజు పాల్‌ హత్య 2015లో జరిగింది. ఆయన అలహబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించిన కొద్ది నెలల్లోనే ఈ దారుణం జరిగింది. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీంను ఆయన ఓడించారు. ఈ కేసులో అతిక్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ నిందితులు. ఈ కేసులో నిందితులంతా జైలులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ శాసన సభలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై యోగి ఆదిత్యనాథ్ శనివారం మాట్లాడుతున్న సందర్భంగా అఖిలేశ్ యాదవ్ ఈ హత్యాకాండ గురించి ప్రస్తావించారు.  బహిరంగంగా తుపాకులు స్వైరవిహారం చేస్తుండటమే రామరాజ్యమా? అని నిలదీశారు. పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

యోగి స్పందిస్తూ, ప్రయాగ్‌‌రాజ్ సంఘటనల వంటి దుశ్చర్యలను తన ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని స్పష్టం చేశారు. జీరో టాలరెన్స్ పాలసీతో ఇటువంటి సంఘటనలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ సంఘటనతో ప్రమేయం ఉన్న నేరస్థుడు సమాజ్‌వాదీ పార్టీ పెంచి పోషించినవాడు కాదా? అని నిలదీశారు. ఆయనను పార్లమెంటు సభ్యునిగా చేసినది సమాజ్‌వాదీ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఈ మాఫియాలను తాము వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు.

ఉమేశ్ పాల్‌ను హత్య చేసినవారు పరారయ్యారని చెబుతూ మాఫియా ఎంతటివారైనప్పటికీ, రాష్ట్రంలో మాఫియా పాలనను తన ప్రభుత్వం అనుమతించదని ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

‘‘మీరు (సమాజ్‌వాదీ పార్టీ) నేరగాళ్లకు మద్దతిస్తున్నారు. పూలమాలలు వేసి స్వాగతిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి నాటకాలు ఆడుతున్నారు’’ అని యోగి ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్‌ను సమాజ్‌వాదీ సమర్థించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న మాఫియాను మట్టుబెడతామని స్పష్టం చేశారు.