
రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ ఒత్తిడి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం యావత్ ప్రపంచంపై పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్కు ప్రధాని ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ చేరుకున్న ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం పలికాయి.
అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత వారిద్దరూ మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు భారత్ సూచిస్తూనే ఉందని పేర్కొన్నారు. ఎలాంటి శాంతి చర్చలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య పరస్పర సహకారం ఉందని ప్రధాని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు గట్టి చర్యలు అవసరమని ఇరు దేశాలు నమ్ముతున్నాయని తెలిపారు. యూరప్‌లో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్‌లో పెట్టుబడులకు ముఖ్యమైన వనరు కూడా అని తెలిపారు.
అలాగే భారత్, జర్మనీ మధ్య బలమైన సంబంధాలు ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంటూ గత కొన్నేళ్లుగా భారత్, జర్మనీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని మోదీ తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కారణంగా ప్రపంచం మొత్తం బాధపడుతోందని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తెలిపారు. హింసతో దేశ సరిహద్దులను ఎవరూ మార్చలేరని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం వల్ల అపారమైన నష్టం, విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. ఈ యుద్ధాన్ని ఒక విపత్తుగా అభివర్ణించారు.
“భారత్ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. అది భారత్, జర్మనీ మధ్య సంబంధాలకు చాలా మంచిది. రష్యా దురాక్రమణ పర్యవసానాలతో ప్రపంచం అల్లాడిపోతోంది. దాదాపు 1,800 జర్మన్ కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. అవి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాయి. మాకు ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలి. సాఫ్ట్‌వేర్ రంగం భారత్‌లో బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు భారత్‌లో ఉన్నాయి” అని పేర్కొన్నారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి