రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలికిన సోనియా!

సుదీర్ఘంగా సాగిన తన రాజకీయ ప్రస్థానానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముగింపు పలుకుతున్న సంకేతం ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానాన్ని భారత్ జోడో యాత్రతో ముగిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. చత్తీస్‌ఘడ్‌‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహిస్తోన్న ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగించిన సోనియా గాంధీ రాజకీయాల నుండి తన విరమణ ప్రకటనను వెల్లడించారు.

 “భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌ పార్టీకి టర్నింగ్ పాయింట్. భారత్ జోడో యాత్రతో నా పొలిటికల్ ఇన్నింగ్స్ ముగిసింది. దేశానికి కాంగ్రెస్‌కు 2024 ఎన్నికలు పరీక్షలాంటివి. యూపీఏ పాలన నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది.” అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

3 రోజుల పాటు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి సోనియా గాంధీ ప్రసంగించారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారన్న విషయం భారత్‌ జోడో యాత్రతో తెలిసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో వచ్చే ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని శ్రేణులకు సోనియా సూచించారు.

కాగా, మొదటిరోజుననే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు జరపరాదని నిర్ణయించడం, అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నామినేట్ చేయాలని పేర్కొనడం పట్ల పార్టీ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అధ్యక్ష రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఎన్నికలు జరిపి, గాంధీ కుటుంభం వెలుపల ఓ వ్యక్తికి అధ్యక్ష పదవి అప్పచెప్పిన తర్వాత కూడా, ఆ కుటుంబానికి సన్నిహితులే పార్టీలో కీలక పదవులలో ఉండేవిధంగా చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

పార్టీలో ప్రజాస్వామ్యం నెలకొనాలని కోరుతున్న వారిని పక్కన పెట్టేందుకే, ముఖ్యంగా 2024 ఎన్నికలకు దూరంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. కాగా, ఈ ప్లీనరీ సమావేశాల్లో వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహం, ఇతర పార్టీలతో పొత్తులు వంటి కీలక నిర్ణయాలపై పార్టీ వర్గాలు చర్చించనున్నాయి.