నితీష్ కు శాశ్వతంగా బిజెపి తలుపులు మూసివేత

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి కావాలనే కోరికతో బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ్ లతో బీహార్ సీఎం నితీష్ చేతులు కలిపారని ధ్వజమెత్తారు. నీరు, చమురుల కలయిక మాదిరిగా జేడీయూ, ఆర్జేడీలది అపవిత్ర కూటమిగా  ఆయన అభివర్ణించారు.

బీహార్ లోని వెస్ట్ చంపరాన్ జిల్లా లారియాలో శనివారంనాడు జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, బీహార్‌ను ఆటవిక రాజ్యంగా నితీష్ మార్చేశారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు మనసు మార్చుకునే నితీష్‌తో భాగస్వామ్యంపై విసుగెత్తిపోయామని, ఇక ఎప్పటికీ ఆయనకి బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు.

”జయప్రకాష్ హయాం నుంచి ఆయన (నితీష్) తన జీవితమంతా కాంగ్రెస్, జంగిల్ రాజ్‌పై పోరాడారు. ఇప్పుడు లాలూ ఆర్జేడీ, సోనియా గాంధీ కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలిపారు. ప్రధాన మంత్రి పదవి కావాలనే ఆశతో అభివృద్ధి వాది నుంచి అవసరవాదిగా మారారు” అని అమిత్‌షా విమర్శలు గుప్పించారు.  బీహార్ పరిస్థితి బాగోలేదని, శాంతిభద్రతలు లేవని పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులను చంపుతున్నారని, నితీష్ మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారని ధ్వజమెత్తారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పాపులర్ ఫ్రండ్ ఆఫ్ ఇండియాను ప్రధాన మంత్రి నిషేధించారని గుర్తుచేశారు.

బీహార్‌లో ఆటవిక పాలనకు చరమగీతం పాడాలంటే ఒకే మార్గం ఉందని చెబుతూ మూడింట రెండు వంతుల మెజారిటీ తిరిగి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని ఆయన పిలుపిచ్చారు. బీహర్‌లో ప్రతి రోజూ ఏదో ఒక హత్య, అత్యాచారం వార్తలు వెలుగుచూస్తున్నాయని చెబుతూ నితీష్ కుమార్‌కు, ఆయన ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.

గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని, అయినప్పటికీ ప్రధానమంత్రి ఇచ్చిన మాట కోసం మరోసారి నితీష్‌ను ముఖ్యమంత్రిని చేశారని అమిత్‌షా గుర్తు చేశారు. బీహార్‌ వెనుకబాటుతనాన్ని నితీష్, లాలూ ఎప్పటికీ పోగొట్టలేరని స్పష్టం చేశారు. తన తర్వాత ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ను చేస్తానని నితీష్ ప్రకటించారని గుర్తు చేస్తూ ఎప్పుడు తేజస్విని సీఎంగా చేసి బీహార్ ను తిరిగి జంగిల్ రాజ్ గా మారుస్తారో చెప్పాలని అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇదే తగిన తరుణమని అమిత్ షా చెప్పారు. ఇందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మార్గం సుగమమవుతుందని భరోసా వ్యక్తం చేశారు. సుమారు అరగంట సేపు చేసిన ప్రసంగంలో సర్జికల్ దాడులు, బాలాకోట్ వాయుదాడులు, 370 అధికరణ రద్దు, ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐ‌పై నిషేధం వంటి అంశాలను అమిత్‌షా ప్రస్తావించారు