ప్రీతిది ముమ్మాటికీ ‘‘లవ్ జిహాదీ కేసు’’

వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతిది ముమ్మాటికీ ‘‘లవ్ జిహాదీ’’ కేసేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అమ్మాయిలను టార్గెట్ చేసి మరీ వేధింపులకు గురి చేస్తున్నారని, అందుకోసం విదేశాల నుండి పెద్ద ఎత్తున నిధులొస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
కాగా, నిమ్స్ హాస్పటల్ చికిత్స పొందుతున్న ప్రీతిని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.ఈ ఘ‌టనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేప‌డుతోందని చెబుతూ నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
 
వరంగల్ లో మెడికల్ విద్యార్ధిని ప్రీతిపై ర్యాగింగ్ చేయడంవల్లే ఆత్మహత్యాయత్నం చేసిందని సంజయ్ స్పష్టం చేశారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని,. విద్యార్థి సంఘాల ఆందోళనను చల్లబర్చడానికి మెరుగైన వైద్యం పేరుతో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అనేక సార్లు అమ్మాయిపై వేధింపులకు గురిచేసిందని ప్రీతి తండ్రే చెప్పారని గుర్తు చేశారు.  దీనిని చిన్న కేసుగా మార్చి నీరుగార్చే కుట్ర. వేధింపులకు పాల్పడ్డ వారి విషయంలో ఉదారత చూపుతున్న పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యలుపై చూపకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 
నాలుగు నెలలుగా ప్రీతిని సైఫ్ వేధిస్తున్నాడు
 
కాగా, నాలుగు నెలలుగా ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. వాట్సప్ గ్రూపులో ప్రీతిని అవమానించేలా పోస్టులు పెట్టాడని, అలా మేసేజ్‌లు పెట్టవద్దని ప్రీతి వేడుకుందని పేర్కొన్నారు. సైఫ్ పెట్టిన మేసేజ్‌లను తాము పరిశీలించామని, ఇతర విద్యార్థులతో కలిసి ప్రీతిని వాట్సప్ గ్రూపుల్లో టార్గెట్ చేసినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించామని స్పష్టం చేశారు.
 
’20వ తేదీన వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి చెప్పింది. 21వ తేదీన కాలేజీ యాజమాన్యం ప్రీతి, సైఫ్‌ను పిలిచి విచారించింది. మంగళవారం తెల్లవారుజామున ప్రీతి ఆత్మహత్యాయత్నం చేేసుకుంది. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ సహించలేకపోయాడు. వాట్సప్ గ్రూపుల్లో అవమానకరంగా మెసేజ్‌లు పెట్టి వేధించడం కూడా ర్యాగింగ్ కిందకు వస్తుంది. పాయింజన్ ఇంజెక్షన్ ఏముంది అన్న దానిపై గూగుల్‌లో ప్రీతి సెర్చ్ చేసింది. కేసును పక్కదారి పట్టిస్తున్నామని ఆరోపణలు చేయడం సరికాదు’ అని రంగనాథ్ వివరించారు.
 
‘ప్రీతికి ప్రశ్నించే గుణం ఉంది.. ఆమె డేరింగ్, సెన్సిటివ్. ఆమె ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేక ప్రీతికి సహకరించవద్దని తన ఫ్రెండ్స్‌కు చెప్పాడు. సైఫ్ సమస్య గురించి ప్రీతి కంటిన్యూగా ఆలోచించింది. సైఫ్ వేధిస్తున్నాడని మనస్తాపానికి గురై ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది. ఏ ఇంజెక్షన్ తీసుకుందనే దానిపై రిపోర్ట్ రావాల్సి వచ్చింది. టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయి’ అని చెప్పారు.