ప్రసవ సమయంలో ప్రతి రెండు నిమిషాలకు ఓ మహిళ మృతి

గర్భధారణ, లేదా ప్రసవ సమయంలో ప్రతి రెండు నిమిషాలకు ఓ మహిళ మృతి చెందుతున్నదని తాజా గణాంకాలను సూచించడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆందోళన వ్యక్తం చేసింది.  గర్భధారణ, ప్రసవం అనేవి మహిళలందరికీ ఆశాజనకంగా, సానుకూల అంశంగా ఉండాల్సి ఉండగా.. ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా మహిళలకు ఇది ప్రమాదకరంగా మారుతోందని డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
 
ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలో, అనంతరం ప్రతి స్త్రీ, బాలికలకు సురక్షితమైన ఆరోగ్య సేవలు అందాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు చూపుతున్నాయని తెలిపారు. గత 20 ఏళ్లలో పుట్టుక సమయంలో బాలల మృతులు మూడో వంతు తగ్గినప్పటికీ తల్లులకు ప్రమాద సూచికలు మాత్రం తగ్గటం లేదు.
ప్రతి స్త్రీ తన సంతానోత్పత్తి సమయంలో పొందాల్సిన హక్కులను పూర్తిగా అందించాల్సిన ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. ప్రసవానంతరం తీవ్ర  రక్తస్రావం, అధిక రక్తపోటు, గర్భధారణ సమయంలో  అంటువ్యాధులు, తీవ్రమయ్యే శారీరక సమస్యలు,   అసురక్షిత అబార్షన్‌ కారణంగా వచ్చే సమస్యలు  ప్రసూతి మరణాలకు కారణమవుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.
 
ఇవన్నీ చాలావరకు నివారించతగినవి, చికిత్స చేయదగినవేనని తెలిపింది.  ప్రసూతి మరణాలు పేద, యుద్ధ ప్రభావిత దేశాల్లో అధికంగా ఉంటున్నాయని తెలిపింది. 2000-2015 మధ్య ప్రసూతి మరణాలను తగ్గించడంలో గణనీయమైన పురోగతి కనిపించినప్పటికీ.. 2020 నుండి ఐదేళ్లలో కొన్ని దేశాల్లో ఆ సంఖ్య అలాగే నిలిచిపోగా, మరికొన్ని దేశాల్లో పెరిగినట్లు ఆ నివేదిక పేర్కొంది.
 
2016 నుండి ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ దేశాలు మాత్రమే ప్రసూతి మరణాల రేటుని గణనీయంగా తగ్గించగలిగాయని తెలిపింది. నివేదిక ప్రకారం… ఎనిమిది ఐక్యరాజ్యసమితి ప్రాంతాల్లో యూరప్‌, ఉత్తర అమెరికా, లాటిన్‌ అమెరికా మరియు కరేబియన్‌ దేశాలలో ప్రసూతి మరణాల రేటు 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. రెండు రీజియన్‌లలో ఎలాంటి పెరుగుదల లేదని తెలిపింది.
 
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రసూతి మరణాల రేటు 35 శాతం తగ్గగా, దక్షిణాసియలో 16 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 2020లో మొత్తం ప్రసూతి మరణాల్లో 70 శాతం ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతాల్లో నమోదైనట్లు పేర్కొంది. మానవతా సంక్షోభాలను ఎదుర్కొంటున్న తొమ్మిది దేశాల్లో ఈ రేటు ప్రపంచ సగటు కంటే రెట్టింపుగా ఉందని తెలిపింది.
 
సుమారు 2.7 కోట్ల మందికి ఆధునిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అందుబాటులో లేవని, సుమారు మూడింట ఒకవంతు మంది స్త్రీలు వైద్యులు సిఫార్సు చేసిన ఎనిమిది ప్రసవాంతర తనిఖీల్లో నాలుగింటిని కూడా కలిగి లేరని, అలాగే అవసరమైన ప్రసవానంతర సంరక్షణను పొందడం లేదని నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి ఆరోగ్య సంరక్షణపై కొంత ప్రభావం చూపి ఉండవచ్చని, అయితే వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు అదనపు కృషి చేయాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది.