గవర్నర్ కు ఎమ్యెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణలు

తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు.  గవర్నర్‌కు సైతం రాతపూర్వకంగా క్షమాపణ కోరుతూ లేఖ రాస్తానని, ఆ లేఖ కాపీని జాతీయ మహిళా కమిషన్‌కు కూడా అందజేస్తానని వెల్లడించారు. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
 
గవర్నర్‌ తమిళిసై పై అవమానకరమైన రీతిలో కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది.  ఆ వాఖ్యలను సుమోటోగా స్వీకరించి ఆయనకు కమిషన్ నోటీసులిచ్చింది. జనవరి 25న తెలంగాణ రాష్ట్రంలోని జమ్మికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
 
ఈ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. మహిళా గవర్నర్‌పై ఓ ప్రజా ప్రతినిధి అసభ్య పదజాలాన్ని ఉపయోగించడాన్ని తప్పుబడుతూ జాతీయ మహిళా కమిషన్ ఫిబ్రవరి 14న నోటీసులు జారీ చేసింది.
 
కౌశిక్ రెడ్డి స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆ మేరకు కౌశిక్ రెడ్డి మంగళవారం ఓ న్యాయవాదితో పాటు విచారణకు హాజరయ్యారు. అప్పటికే సిద్ధం చేసుకున్న రాతపూర్వక వివరణను కూడా కమిషన్‌కు అందజేశారు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ స్వయంగా ఈ విచారణ జరిపారు.
 
విచారణకు వచ్చిన కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పడంతో కథ సుఖాంతమైంది. ఆ మధ్య గవర్నర్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల విషయంలో ప్రతిష్టంభన నెలకొని, హైకోర్టు వరకు వివాదం చేరిన సందర్భంలో గవర్నర్ పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.