బిజెపి నేత మురళీకృష్ణ గౌడ్ హత్యకు ఎమ్యెల్యే రోహిత్ రెడ్డి కుట్ర!

అధికార బిఆర్ఎస్ కు చెందిన వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్  తనను, తన కుటుంబాన్ని హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని  అదే జిల్లాకు చెందిన బీజేపీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ మురళీకృష్ణ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన తండ్రి విఠల్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని పేర్కొంటూ తమకు ఏం జరిగినా వారిదే బాధ్యత అని స్పష్టం చేశారు. ”

“రోహిత్‌ రెడ్డి సోమవారం నా ఇంటిపైకి రౌడీలు, గూండాలను పంపించాడు. మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశాడు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే కుటుంబంతో కలిసి బీఆర్‌ఎస్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటా” అంటూ హెచ్చరించారు.
 
“రోహిత్‌ రెడ్డి తాండూరుకు వన్‌ టైం ఎమ్మెల్యే. ఆయన చేయని అక్రమ వ్యాపారం లేదు. అన్నం పెట్టిన ఇంటిపైన ఎమ్మెల్యే దాడి చేయించారు. ఫ్యాక్షనిజాన్ని తాండూర్‌లో చూపిస్తున్నారు. అనేక అక్రమాలు చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నాకు తగిన గుణపాఠం జరిగింది. రోహిత్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉంది. ప్రభుత్వం నాకు వెంటనే రక్షణ కల్పించాలి. ఇక్కడ ఉన్న పోలీసులపై నాకు నమ్మకం లేదు.” అని మురళీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు
 
మురళీకృష్ణ గౌడ్‌ ఇంటిపై దాడి విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నేత, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. మురళీకృష్ణ గౌడ్‌ను చంపాలనే రోహిత్‌ రెడ్డి అనుచరులు పక్కా ప్లాన్‌తో దాడి చేశారని వారు ఆరోపించారు. ఫైలట్ రోహిత్‌ రెడ్డి డ్రగ్స్‌కు బానిస కావటం వల్లే నేరాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.
 
హత్యాయత్నం కేసు పెట్టాల్సిందే

 
కాగా, హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు, డ్రగ్స్ దందాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాండూరులో పోలీసుల సమక్షంలోనే బీజేపీ నేత మురళీగౌడ్ నివాసంపై దాడులు జరిపి పసిపిల్లలని చూడకుండా కుటుంబ సభ్యులను చంపే యత్నం చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
 
‘‘పోలీసులు చేతగానివాళ్లా? మాపై కూడా దాడులు జరిగాయని పోలీసులు చెప్పడం సిగ్గు చేటు…మీలాంటి వాళ్లకు డ్యూటీ ఎందుకు? తప్పుకుని ఇంట్లో కూర్చోండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డీజీపీ స్పందించి బాధ్యులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
 
బుధవారం తాండూరు విచ్చేసిన సంజయ్ మురళీ గౌడ్ నివాసానికి వెళ్లి మురళీ గౌడ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజకీయాలతో కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెబుతూ మీకు చేతనైతే నేతలతో కొట్లాడండి. కానీ డ్రగ్స్ తీసుకుని, మందుతాగి వచ్చి దాడి చేశారని అంటూ వాళ్లను టెస్ట్ చేయాలని స్పష్టం చేశారు. 

 
ఇండ్ల మీద దాడి చేసే సంస్కృతి ఏంది? తలుపులు పగలకొడతారా? పెట్రోలు చల్లుతారా? అంటూ దుయ్యబట్టారు. దాడి చేస్తారని పోలీసులకు ముందే తెలిసి కూడా దాడిని అడ్డుకోరా? దగ్గరుండి దాడి చేయిస్తారా? అంటూ ప్రశ్నించారు. పైగా, సిగ్గులేకుండా తమపై దాడులు చేశారని పోలీసులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.  పోలీస్ వ్యవస్థపై నమ్మకం కుదరాలంటే గూండాలను నిలువరించలేని పోలీసులపై చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు.