సాయన్న అంత్యక్రియలు అధికారికంగా జరపకపోవడం పట్ల బిజెపి ఆగ్రహం

 
ఎమ్యెల్యేగా ఎన్నికైన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడం పట్ల బిజెపి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. నిజాం వారసులకు దక్కిన గౌరవం, అధికార పార్టీకి చెందిన ఎమ్యెల్యేకు కూడా దక్కలేదని అంటూ విచారం వ్యక్తం చేసింది. ఇది కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనమని మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. ఫ్యూడల్‌ మనస్తత్వంతో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
 
సాయన్న అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరిపించని పరిణామంపై ఆయన అనుచరులు సోమవారం  స్మశానంలో నిరసన వ్యక్తం చేశారు. దానితో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జోక్యంతో అధికారిక లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు జరిగాయి.
 
సీఎం కేసీఆర్‌కు దళితులు అంటే ఎంత ప్రేమో దీనిని చూస్తే తెలుస్తోందని ఈటెల ఎద్దేవా చేశారుఅన్ని వర్గాలను కేసీఆర్‌ మోసగించారని చెబుతూ ఏడేళ్లుగా దళితులకు ఒక్క ఎకరం భూమిని కూడ ఇవ్వకుండా దళితులను కేసీఆర్‌ మోసగించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణీ పేదల కొంపముంచిందని పేర్కొంటూ  పేదలను బిక్షగాళ్లుగా మార్చిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌ ది అంటూ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈటెల తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారు.
 
కంటోన్మెంట్ ప్రజల బంధువుగా తిరుగులేని దళిత నాయకునిగా ఉమ్మడి రాష్ట్రంలోనే కాక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని తనువుచాలించిన సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకుండ సీఎం కేసీఆర్ పొందిన రాక్షస ఆనందం దొరతననికి తార్కాణమే అంటూ బిజెపి  యస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పుభాష ధ్వజమెత్తారు.
 
మంత్రి తలసాని ద్వారా ప్రభుత్వలాంఛనాలతో అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి కూడా ఏర్పాట్లు ఉద్దేశ్యపూర్వకంగా మర్చిపోయిన వైఖరి పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ముకరంజా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో చనిపోతే ప్రత్యేక విమానంలో వారి శవాన్ని తెచ్చి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన రీతిలో తెలంగాణ ముద్దు బిడ్డ సాయన్న అంత్యక్రియలు జరుపకపోవటం వెనక ఆంతర్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ఎందరో సినీ నటులు, రాజకీయ నేతలకు అంత్యక్రియలను కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కేసీఆర్ దళిత ప్రజాప్రతినిధుల పట్ల ఇటువంటి వివక్షత చూపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా ప్రత్యేక రాష్ట్ర చరిత్రలో దళితుల ఆత్మగౌరవాన్ని సవాల్ చేస్తున్న కేసీఆర్ వైఖరికి ఘాటుగానే ఎదుర్కొంటామని, “మాజీ సీఎం” గా బిరుదు ఇచ్చి లాంఛనంగా సత్కరిస్తామని స్పష్టం చేశారు.