అసంతృప్తితో ఉన్న జెడియు నాయకుడు ఉపేంద్ర కుష్వాహ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ‘రాష్ట్రీయ లోక్ జనతాదళ్ ’ అనే కొత్త పార్టీని ప్రారంభించారు. ”ఇవాళ నుంచి కొత్త రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాయి. కొద్ది మంది మినహా జేడీయూలోని ప్రతి ఒక్కరూ ఆందోళనగానే ఉన్నారు. ఎన్నికైన నా సహచర మిత్రులతో సంప్రదించి, రాజీనామా నిర్ణయం తీసుకున్నారు” అని ప్రకటించారు.
నితీష్ కుమార్ ఆరంభంలో మెరుగ్గా పనిచేసినా ఆపై ఆయన రాజకీయ ఒరవడి నితీష్‌తో పాటు బిహార్‌కు చేటు చేస్తుందని పేర్కొన్నారు. నితీష్ ప్రస్తుతం సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని, తన చుట్టూ చేరిన కోటరీ సలహాలు పాటిస్తున్నారని కుష్వాహ ఆరోపించారు. కొత్తగా రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్టు కుష్వాహ ప్రకటించారు. ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పార్టీకి తాను జాతీయ అధ్యక్షుడిగా ఉంటానని, కర్పూరీ ఠాకూర్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తామని వివరించారు.
ఆర్జేడీతో జేడీయూ ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. గత రెండు రోజులుగా పట్నాలో పార్టీ నేతలతో సుదీర్ఘంగా సాగిన సంప్రదింపుల అనంతరం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కుష్వాహ వెల్లడించారు. విధాన మండలి సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.
అయితే మాజీ కేంద్ర మంత్రి అయిన ఆయన ఎన్‌డిఏతో పొత్తుపెట్టుకునే అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. ‘మా పెద్దన్న , ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను, ఆర్జెడితో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేసిన ఆయన కొన్ని గంటల తర్వాత కొత్త ప్రభుత్వాన్ని(బిజెపితో) ఏర్పాటు చేశారు’ అంటూ పరోక్షంగా సంకేతం ఇచ్చారు.
నితీశ్ కుమార్ తన రాజకీయ మూలధనాన్ని ‘తాకట్టు’ పెట్టారు, ఆర్‌జెడికి చెందిన తేజస్వి యాదవ్‌ను ఉపముఖ్యమంత్రిగా ప్రకటించారని కుష్వాహ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు, 62 ఏళ్ల ఉపేంద్ర కుష్వాహకు మధ్య ఇటీవల కాలంలో అభిప్రాయ భేదాలు పొడచూపాయి. 2021 మార్చిలో ఉపేంద్ర కుష్వాహ తన సొంత పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్‌పీ)ని జేడీయూలో విలీనం చేశారు.
అయితే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవిని నితీష్ కట్టబెట్టినప్పటి నుంచి కుష్వాహ వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది. నితీష్ తనను నిర్లక్ష్యం చేశారనే అభిప్రాయంతో కుష్వాహ ఉన్నారు. కుష్వాహకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నారంటూ ఆయన వర్గీయులు ప్రచారం చేయడం, అలాంటిదేమీ లేదని నితీష్ తేల్చిచెప్పడంతో మరోసారి కుష్వాహకు ఆశాభంగమైంది.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో స్మృతి మంధాన