ఉత్తరాఖండ్ యువత తమ గ్రామాలకు తిరిగి రావాలి

పర్వతాల నీరు, యువత పర్వతాలకు ఉపయోగపడవనే పాత సామెత నుండి విముక్తి పొందాలని చెబుతూ ఉత్తరాఖండ్ యువత తమ గ్రామాలకు తిరిగి రావాలనేది కేంద్ర ప్రభుత్వ నిరంతర ప్రయత్నం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్త‌రాఖండ్ రోజ్‌-గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ పర్వత ప్రాంతాలలో కల్పిస్తున్న కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల గురించి ప్రముఖంగా వివరించారు.

యువత తమ సేవల ద్వారా భారతదేశ అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుతూ, “ఇది భారత దేశ యువతకు అద్భుతమైన అవకాశాల అమృత్ కాల్” అని ప్రధాని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, కొత్త రోడ్డు, మార్గాలను ఏర్పాటు చేయడం ద్వారా అనుసంధానతను పెంపొందించడంతో పాటు అనేక ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నట్టు తెలిపారు.

అన్ని చోట్లా ఉద్యోగావకాశాలు ఊపందుకుంటున్నాయని చెబుతూ భవన నిర్మాణ కార్మికులు, ఇంజనీర్లు, ముడిసరుకు పరిశ్రమలు, దుకాణాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు.  రవాణా రంగంలో డిమాండ్ పెరగడం వల్ల ఏర్పడుతున్న కొత్త అవకాశాల గురించి కూడా ఆయన వివరించారు. గతంలో ఉత్తరాఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల యువత ఉపాధి కోసం పెద్ద నగరాలకు వలస వెళ్ళేవారని పేర్కొంటూ, అయితే నేడు వేలాది మంది యువకులు గ్రామాల్లో ఇంటర్నెట్, డిజిటల్ సేవలను అందిస్తున్న సాధారణ సేవా కేంద్రాల్లో పనిచేస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు.

ఈ ఉద్యోగాలు భారతదేశంలో మొదటిసారిగా ఉత్తరాఖండ్‌ లో సృష్టించినట్లు స్పష్టం చేశారు. ప్రతి యువకుడు ముందుకు సాగడానికి సరైన మాధ్యమాన్ని పొందుతూ వారి ఆసక్తి ఆధారంగా కొత్త అవకాశాలను పొందాలనే ఉద్దేశంతో, కేంద్ర, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పారు.ఈ దిశగా ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాల కోసం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా ప్రచారం చేస్తూ ముందడుగు వేస్తున్నాయని ప్రధాని తెలిపారు.

సుదూర ప్రాంతాలను రోడ్డు, రైలు, ఇంటర్నెట్‌ తో అనుసంధానించడంతో ఉత్తరాఖండ్‌ లో పర్యాటక రంగం విస్తరిస్తున్నదని, పర్యాటకరంగ పటంలోకి కొత్త పర్యాటక ప్రదేశాలు వచ్చి చేరుతున్నాయని ప్రధాని చెప్పారు. పర్యాటక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ముద్రా యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

షాపులు, ధాబాలు, అతిధి గృహాలు, హోమ్‌స్టేల వంటి ఉదాహరణలను ప్రధానమంత్రి పేర్కొంటూ, అటువంటి వ్యాపారాలకు ఎలాంటి హామీ లేకుండా పది లక్షల రూపాయల వరకు ఋణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ‘‘దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 38 కోట్ల రూపాయల మేర ముద్రా ఋణాలు ఇచ్చాం. దాదాపు 8 కోట్ల మంది యువకులు తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారారు”, అని ప్రధానమంత్రి చెప్పారు. వీరిలో మహిళలతో పాటు, ఎస్.సి./ఎస్.టి./ఓ.బి.సి. వర్గాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని కూడా ఆయన తెలియజేశారు.