12 మంది ప్రతిపక్ష ఎంపిలపై హక్కుల తీర్మానం!

సభా  కార్యక్రమాలకు  అంతరాయం  కల్గించిన  12 మంది  విపక్ష పార్టీల ఎంపీలపై  విచారణ చేయాలని పార్లమెంటరీ  ప్రివిలేజ్ కమిటీని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ ఆదేశించారు. సభ హక్కులు, నియమాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ జగదీప్‌ ధన్‌ఖర్‌ 12 మంది ప్రతిపక్ష ఎంపిల పేర్లను (9 మంది కాంగ్రెస్‌ ఎంపిలు, ముగ్గురు ఆప్‌ ఎంపిలు) కమిటీకి సూచించారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో కమిటీ పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారు. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం వారిపై అవసరమైన చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. ఫిబ్రవరి 18న విడుదలైన ప్రత్యేక నోటీసులో రాజ్యసభ సెక్రటేరియట్‌ ఈ విధంగా పేర్కొంది.

ఇటీవల పార్లమెంట్‌లో జరిగిన బడ్జెట్‌ సెషన్‌లో ప్రతిపక్ష ఎంపిలు సభా నియమాలు, హక్కులను ఉల్లంఘించారని, నినాదాలు చేయడంతో పాటు పదేపదే వెల్‌లోకి దూసుకువచ్చారని, సభకు కార్యక్రమాలను అడ్డుకున్నారని, దీంతో ఉప రాష్ట్ర పతి సభను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపింది. కాంగ్రెస్‌, ఆప్‌ ఎంపిలు కొందరు అక్రమంగా ప్రవర్తించారని, పదే పదే సభ వెల్‌ లోకి ప్రవేశిండచం, నినాదాలు చేయడం వంటివి చేసి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

కాంగ్రెస్‌కు చెందిన శక్తిసిన్హ్‌ గోహిల్‌, నారన్‌భాయ్  జె రథ్వా, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, కుమార్‌ కేత్కర్‌, ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి, ఎల్‌ హనుమంతయ్య, ఫూలో దేవి నేతమ్‌, జెబి మాథర్‌ హిషామ్‌ మరియు రంజీత్‌ రంజన్‌లతో పాటు ఆప్‌ ఎంపిలు సంజయ్  సింగ్‌, సుశీల్‌ కుమార్‌ గుప్తా మరియు సందీప్‌ కుమార్‌ పాఠక్‌లు ఉన్నారు.