హఠాత్తుగా ‘యుద్ధభూమి’ ఉక్రెయిన్‍లో బిడెన్ పర్యటన

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి ఈ నెల 24కు సంవత్సరం కావొస్తున్నా సమయంలో  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హఠాత్తుగా ఉక్రెయిన్‍లోని కీవ్‍ నగరంలో ప్రత్యక్షం కావడం సంచలనం కలిగిస్తున్నది. సోమవారం కీవ్‍లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‍స్కీని కలిశారు. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్‍లో బైడెన్ పర్యటించడం ఇదే తొలిసారి.

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. ఉక్రెయిన్‍కు మరిన్ని ఆయుధాలను సరఫరా చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రజలను రక్షించేందుకు ఆయుధాలు, నిఘా వ్యవస్థలను ఇస్తామని చెప్పారు. రష్యాతో పోరాటంలో ఉక్రెయిన్‍ను పూర్తి మద్దతునిస్తామని ప్రకటించారు. రష్యాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని జెలెన్‍స్కీతో బైడెన్ చెప్పారు.

అనంతరం అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు కొత్తగా 50 కోట్ల డాలర్లు (రూ.4,000 కోట్లు) సైనిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం ‘మారియిన్‌స్కీ ప్యాలెస్‌’లో వద్ద బైడెన్‌ మాట్లాడుతూ యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని హామీ ఇచ్చారు.

యుద్ధం ప్రారంభమై సంవత్సరం తరువాత కూడా ఉక్రెయిన్‌ నిలబడిందని, ‘ఉక్రెయిన్‌ నిలబడ్డంతో ప్రజాస్వామ్యం నిలబడిందని ఆయన చెప్పారు. అమెరికన్లు మీతో ఉన్నారు. మొత్తం ప్రపంచం కూడా మీతో ఉన్నారని బైడెన్‌ భరోసా ఇచ్చారు.  ఉక్రెయిన్ మిలటరీ ఆఫీసర్లు యూనిఫామ్ ధరించి వరుసగా నిలబడగా బైడెన్, జెలెన్‍స్కీ నడుస్తూ వెళ్లారు. గత ఏడాదిగా రష్యా భీకర దాడులకు పాల్పడుతోంది.

రష్యా సైనికులు ఉక్రెయిన్ భూభాగంపై నుంచి దాడులు చేస్తుంటే, యుద్ధ విమానాలు ఆకాశం నుంచి క్షిపణులు కురిపిస్తున్నాయి.  ఈ దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు పౌరులు కూడా చాలా మంది మృత్యువాత పడ్డారు. రష్యాకు కూడా ప్రాణ నష్టం జరిగింది. ఉక్రెయిన్‍లో మౌలిక సదుపాయాలు, వేలాది భవనాలు ధ్వంసం అయ్యాయి. ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాపై చాలా ఆంక్షలు విధించాయి.

అయినా, యుద్దం ప్రారంభమై ఏడాది సమీపిస్తున్నా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‍లోని కొన్ని నగరాలు ఇప్పటికీ రష్యా ఆధీనంలో ఉన్నాయి. తరచూ ఉక్రెయిన్‍పై రష్యా దాడులకు పాల్పడుతోంది.మరోవైపు యుద్ధానికి సహకరించేందుకు రష్యాకు చైనా ఆయుధాలను పంపుతుందని వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ తరుణంలో బైడెన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. యుద్ధంలో తమపై రష్యా గెలిచే అవకాశమే లేదని  జెలెన్‍స్కీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చైనా ఈ యుద్ధంలో రష్యాకు మద్దతు ఇస్తే ప్రపంచ యుద్ధం అనివార్యమని ఆయన హెచ్చరించారు. బైడెన్ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కలిసికట్టుగా మనం మన నగరాలను, ప్రజలకు రష్యా ఉగ్రవాదం నుంచి కాపాడుకుందాం” అని భరోసా వ్యక్తం చేశారు.  ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశం పోలాండ్‌లోనూ బైడెన్ ప‌ర్య‌టించ‌నున్నారు. అక్క‌డ ఆ దేశ అధ్య‌క్షుడు ఆండ్రేజ్ దుడాతో ఆయ‌న సంప్ర‌దింపులు జ‌ర‌ప‌నున్నారు.