తుర్కియేలో 4 వేల మందికి చికిత్స అందించాం

తుర్కియే భూకంప  బాధితుల్ని ర‌క్షించేందుకు ఆప‌రేష‌న్ దోస్త్ పేరుతో భార‌త్ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. అయితే ఆప‌రేష‌న్ దోస్త్‌కు వెళ్లిన ఇండియ‌న్ ఆర్మీ మెడిక‌ల్ టీమ్ స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చింది. ఘ‌జియాబాద్‌లోని హిండ‌న్ ఎయిర్‌బేస్‌లో ఇవాళ మెడిక‌ల్ బృందంతో విమానం ల్యాండ్ అయ్యింది. టర్కీలో వైద్య సేవలు అందించడానికి అక్కడకు చేరుకున్న మొదటి బృందం భారత దేశం నుండే కావడం గమనార్హం.

భూకంప కేంద్ర‌మైన హ‌ట‌య్‌లోని ఇకేంద్ర‌న్‌లో 30 ప‌డ‌క‌ల ఫీల్డ్ హాస్పిట‌ల్‌ను భార‌త బృందం ఏర్పాటు చేసింది. సుమారు నాలుగు వేల మంది రోగులకు అక్క‌డ ట్రీట్మెంట్ ఇచ్చిన‌ట్లు విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చి తెలిపారు. 60 పారా ఫీల్డ్‌ మెడిక‌ల్‌ బృందంలో మొత్తం 99 మంది ఉన్నారు. ఈ బృందంలో 13 మంది ఆర్థో, జనరల్ సర్జన్ లతో సహా వైద్యులు, కమ్యూనిటీ మెడికల్ నిపుణులు, ముగ్గురు వైద్యాధికారులు ఉన్నారు.

వీరు 841 కార్టూన్ల మందులతో పాటు 6.19 టన్నుల బరువుగల రక్షక పరికరాలను, ఇతర రోగనిర్ధారణ పరికరాలను కూడా తమతో తీసుకెళ్లారు. మొదటి తెల్లవారుజామున రాత్రి 3.30 గంటల సమయంలో ఒకరికి అత్యవసరమైన, క్లిష్టమైన ఒక శస్త్రచికిత్సను మూడున్నర గంటల సేపు జరిపారు. ఆ రోగి కోలుకున్నారు.

60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిట‌ల్ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ ఆద‌ర్శ శ‌ర్మ మాట్లాడుతూ  తుర్కియేకు హుటాహుటిన ద‌ళాన్ని పంపించినందుకు ప్ర‌భుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే ఫీల్డ్ హాస్పిట‌ల్‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.  దాదాపు 4వేల మంది పేషెంట్ల‌కు చికిత్స అందించామ‌ని, దాంట్లో మేజ‌ర్‌, మైన‌ర్ స‌ర్జ‌రీ కేసులున్నాయ‌ని పేర్కొన్నారు.

స‌రైన స‌మ‌యంలో స‌రైన చికిత్స‌ను అందించామ‌ని, ఆ ల‌క్ష్యాన్ని తాము అందుకున్న‌ట్లు క‌ల్న‌ల్ ఆద‌ర్శ్ శ‌ర్మ తెలిపారు. ఫీల్డ్ హాస్పిట‌ల్‌ను ఏర్పాటు చేసిన రెండు గంట‌ల్లోనే చికిత్స ప్రారంభించిన‌ట్లు మెడిక‌ల్ ఆఫీస‌ర్ మేజ‌ర్ బీనా తివారి తెలిపారు. త‌మ‌కు స‌హ‌క‌రించిన తుర్కియే ప్ర‌భుత్వానికి, అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

తుర్కియే కృతజ్ఞతలు

సహాయక కార్యక్రమాల్లోఎన్డీఆర్‌ఎఫ్‌, ఇండియన్‌ ఆర్మీ పాలుపంచుకున్నాయి. కాగా, ఆపదలో ఉన్న తమ దేశానికి అండా నిలిచిన భారత్‌కు తుర్కియే కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు భారత్‌లోని తుర్కియే అంబాసిడర్‌ ఫిరాత్‌ సునేల్‌ ట్వీట్‌ చేశారు.

‘భారత ప్రభుత్వం మాదిరే.. విశాల హృదయం ఉన్న భారతీయ ప్రజలు కూడా భూకంప ప్రాంతంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి చేతులు కలిపారు. మీ విలువైన సహాయానికి మేము నిజంగా అందరినీ అభినందిస్తున్నాము’ అంటూ సునేల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్‌ నుంచి తుర్కియేకి తరలించిన టన్నుల కొద్దీ సామగ్రికి సంబంధించిన వీడియోను ట్వీట్‌కు జతచేశారు.

కాగా, తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపంలో ఇప్పటి వరకు 46 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. పలు దేశాలకు చెందిన సహాయక బృందాలు రంగంలోకి భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలు రక్షించే ప్రయత్నం చేశారు.