గోధ్రా రైలు దగ్ధం కేసులో దోషులకు మరణశిక్ష పడాల్సిందే

గోధ్రా రైలు దగ్ధం కేసులో 11 మంది దోషులకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా గుజరాత్ హైకోర్టు మార్చిన నేపథ్యంలో 11 మంది దోషులకు మరణశిక్ష విధించాలని తాము కోరుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియచేసింది.

ఈ కేసులో పలువురు నిందితుల బెయిల్ దరఖాస్తులపై విచారణను మూడు వారాల తర్వాత జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెడి పాండివాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కాగా.. ఈ కేసులోని దోషులకు సంబంధించిన శిక్షాకాలాన్ని, వారు ఇప్పటికే అనుభవించిన జైలు శిక్ష వంటి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించవలసిందిగా ఉభయ పక్షాల న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది.

2002లో జరిగిన గోధ్రా రైలు దగ్ధం సంఘటనలో మహిళలు, పిల్లలతోసహా మొత్తం 59 మంది మరణించారని, ఇది అత్యంత అరుదైన కేసులలో ఒకటని, ఈ కేసులో 11 మంది దోషులకు ప్రత్యేక కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా హైకోర్టు సవరించిందని, దోషులకు మరణశిక్ష విధించాలని తాము గట్టిగా కోరతామని గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు.

ఈ కేసులో మొత్తం 31 మందిని దోషులుగా ప్రత్యేక కోర్టు నిర్ధారిచిందని, వారిలో 11 మందికి మరణశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని ఆయన తెలిపారు. ఈ శిక్షలను హైకోర్టు కూడా ధ్రువీకరించిందని, అయితే మరణశిక్షను యావజ్జీవ శిక్షగా సవరించిందని ఆయన తెలిపారు. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోధ్రాలో రైలులోని ఎస్ 6 బోగీ దగ్ధం కాగా 59 మంది మరణించారు. ఈ సంఘటన దరిమిలా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగి వేలాదిమంది మరణించారు.