కరోనా తర్వాత పెరుగుతున్న క్యాన్సర్ రోగులు

కరోనా మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టిందని, మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ పేషెంట్లు పెరిగిపోయారని యోగా గురు బాబా రాందేవ్‌ చెప్పారు. కరోనా వ్యాప్తి ముగిసినప్పటి నుంచి క్యాన్సర్‌ పేషెంట్లు బయటకు వస్తున్నారని ఆయన తెలిపారు.

క్యాన్సర్‌తోపాటు దృష్టి లోపం, వినికిడి లోపం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని బాబా రాందేవ్‌ పేర్కొన్నారు. శనివారం గోవాలోని మిరామార్‌ బీచ్‌లో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో మూడు రోజు యోగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం బాబా రాందేవ్‌ మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కూడా పాల్గొన్నారు. అంతకుముందు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోవా సీఎం సావంత్‌తో కలిసి శివలింగం అభిషేకంలో బాబా రాందేవ్‌ పాల్గొన్నారు.  ‘కరోనా తగ్గింది. ఇప్పుడు క్యాన్సర్‌ కేసులు బయటకు వస్తున్నాయి. ప్రజల కంటి చూపుతోపాటు వినికిడి సామర్ధ్యాన్ని కూడా కోల్పోయారు. గోవా వెల్‌నెస్ కేంద్రంగా మారాలని నేను కూడా కలలు కంటున్నాను. భారతదేశం గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ వెల్‌నెస్‌గా మారాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

పర్యాటకులు గోవాకు కేవలం సందర్శనకే కాకుండా రక్తపోటు, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్సకు కూడా రావాలని ఆయన సూచించారు. యోగా, ఆయుర్వేదం, సనాతన, ఆధ్యాత్మికతతో కూడిన పర్యాటక కేంద్రంగా గోవా మారాలని బాబా రాందేవ్‌ చెప్పారు.

బాబా రాందేవ్ మార్గదర్శకత్వంలో యోగా, నేచురోపతి రంగంలో చేసిన పరిశోధనలను గోవా సీఎం సావంత్ అభినందించారు. గోవాను ‘యోగ్ భూమి’గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. బీచ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బాబా రాందేవ్‌తో కలిసి సీఎం సావంత్‌ యోగాసనాలు వేశారు. తర్వాత కాసేపు బీచ్‌లో పరుగెత్తారు.