జార్జ్ సొరోస్‌‌తో అనుబంధాన్నికాంగ్రెస్ బయటపెట్టాలి

భారత దేశ ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేసిన అమెరికన్ బిలియనీర్ జార్జ్ సొరోస్‌‌తో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీని బీజేపీ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో సలీల్ షెట్టి పాల్గొన్నారని, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా షెట్టి వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఈ ఫౌండేషన్స్‌కు జార్జి సొరోస్ ఆర్థికంగా మద్దతిస్తున్నారని పేర్కొంది.

సొరోస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శుక్రవారం స్పందిస్తూ, భారతదేశంలో ప్రజాస్వామిక పునరుజ్జీవానికి అదానీ అంశం కారణమవుతుందా? లేదా? అనేది పూర్తిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఎన్నికల ప్రక్రియలపై ఆధారపడి ఉంటుందని, అంతేకానీ సొరోస్‌కు దీనితో ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. కాగా, బీజేపీ నేతలు గౌరవ్ భాటియా, షెహజాద్ పూనావాలా ఇచ్చిన ట్వీట్లలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి సలీల్ షెట్టి నడుస్తున్నట్లు కనిపిస్తున్న ఫొటోను షేర్ చేశారు. జార్జి సొరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న బంధుత్వం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో కూడా షెట్టి పాల్గొన్నారని వారు తెలిపారు. అంతేకాకుండా షెట్టి ప్ఫైజర్, మొడెర్నా వ్యాక్సిన్లను వాడాలని వాదించారని గుర్తు చేశారు. ఈ వివరాలన్నీ ఆయన పాత ట్వీట్లను చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.

గౌరవ్ భాటియా ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశానికి వ్యతిరేకంగా జార్జి సొరోస్ చేసే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారత దేశం సమైక్యంగా నిలిచిందని స్పష్టం చేశారు. ఇలాంటి దుర్బల పిగ్మీలతో వ్యవహరించే సత్తా ఓ జాతిగా తమకు ఉందని పేర్కొన్నారు.  సొరోస్ సహాయకుడు సలీల్ షెట్టి ఓ ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీఓ)కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఈ ఎన్జీవోకు సొరోస్ ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిపారు. షెట్టి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారని గుర్తు చేశారు.

షెహజాద్ పూనావాలా ఇచ్చిన ట్వీట్‌లో, జైరామ్ రమేశ్ గారూ, ఈ బంధం ఏమని చెప్తోంది? అని ప్రశ్నించారు. మొదట ప్రవీణ్, ఇప్పుడు సలీల్ షెట్టి అన్నారు. కాంగ్రెస్, సొరోస్ కలిసి మెలిసి ఉన్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ చేయి, జార్జి సొరోస్‌తో చెట్టాపట్టాలు వేసుకుందా? అని అడిగారు. జైరామ్ గారూ ఇది ‘‘మనం మనం కలిసి ఉన్నాం’’ అనేనా? అని ప్రశ్నించారు.

ఇదిలావుండగా, కాంగ్రెస్ నేత పి చిదంబరం శనివారం స్పందిస్తూ, తాను జార్జి సొరోస్ వ్యాఖ్యలతో ఏకీభవించబోనని తెలిపారు. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ప్రయత్నంగా ఆయన వ్యాఖ్యలను పేర్కొనడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రభుత్వంలో ఎవరు ఉండాలో, ఎవరు బయటకు పోవాలో భారత దేశ ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.