జార్జ్ సోరోస్.. వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి

బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ వృద్ధుడు, ధనికుడే కాకుండా ప్రమాదకారి అని కూడా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ హెచ్చరించారు. దేశంలో జరిగే చర్చను ప్రభావితం చేసేందుకు ఇటువంటి వారు నిధులు మళ్లించొచ్చని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ముసలాయన, సంపన్నుడు, ఆధారాలను పరిగణనలోకి తీసుకొనని, ఇతర అభిప్రాయాలను పట్టించుకోని నిగూఢమైన దూకుడు ప్రవర్తనగల వ్యక్తి, అత్యంత ప్రమాదకారి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘హిండెన్‌బర్గ్’ ఉదంతంతో భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగొచ్చంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జార్జ్ సోరోస్‌పై జయశంకర్ తాజాగా మండిపడ్డారు. ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు రానప్పుడు సోరోస్ లాంటి వ్యక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలపై సందేహాలు లేవనెత్తుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘జార్జ్‌ న్యూయార్క్‌లోని ప్రముఖ బిలియనీర్‌. ఆయన తన అభిప్రాయాలతోనే ప్రపంచం మొత్తం నడుస్తుందని భావించే వ్యక్తి. గెలిస్తేనే ఎన్నికలు మంచివని అయనలాంటివారు భావిస్తారు. ఆ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వస్తే అది లోపభూయిష్ట ప్రజాస్వామ్యమని చెబుతారు’ అని ఆయన విమర్శించారు. ఆయన న్యూయార్క్‌లో కూర్చుని, తన అభిప్రాయాలు యావత్తు ప్రపంచం పనితీరును నిర్ణయించాలని అనుకుంటారని ఎద్దేవా చేశారు.

ఇక ఈ సందర్భంగా మోదీ హయాంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా వుందన్న జార్జ్‌ వ్యాఖ్యలపై జైశంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారత్‌లోని ప్రజాస్వామ్యాన్ని పరిశీలిస్తే.. ఈరోజు నేను ఓటరుగా ఈ సభకు హాజరయ్యాను. ఎన్నికల ప్రక్రియలో నిర్ణయాత్మక ఫలితాలు అపూర్వమైనది’ అని స్పష్టం చేశారు.

భారత ప్రధాని ప్రజాస్వామ్యవాది కాదని జార్జ్‌ అన్నారని, లక్షలాది మంది ముస్లింల పౌరసత్వాన్ని తొలగించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొన్నేళ్ళ క్రితం జార్జి సొరోస్ ఆరోపించారని గుర్తు చేశారు. అయితే, అది జరగలేదని తెలిపారు. అదొక హాస్యాస్పదమైన వ్యాఖ్య అని ఎద్దేవా చేశారు. అయితే దీని వెనుకగల అసలు అర్థాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.

‘‘ముసలితనం, సంపద, నిగూఢ ప్రవర్తనల వద్ద నేను ఆగిపోవలసి వస్తే, నేను దాన్ని పట్టించుకోను. కానీ ఆయన ముసలివాడు, సంపన్నుడు, నిగూఢ ప్రవర్తనగలవాడు, ప్రమాదకారి. అందువల్ల ఏం జరుగుతోందంటే, అలాంటివారు అభిప్రాయాల నిర్మాణానికి, వాటికి రూపమివ్వడానికి వనరులను పెట్టుబడి పెడుతున్నారు’’ అని తెలిపారు.