ఫిబ్రవరి 27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏపీ కొత్త గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

28న సంతాప తీర్మానాలతో పాటుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ ప్రారంభం కానుంది. తొలి రోజున గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత బీఏసీ భేటీ జరగనుంది. అందులో సమావేశాల నిర్వహణ..బిల్లులు..అజెండాతో పాటుగా కీలకమైన బడ్జెట్ ప్రతిపాదించే తేదీ పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

రెండో రోజు సంతాప తీర్మానాలు, తర్వాత సభ వాయిదా వేయనున్నారు. మళ్లీ తిరిగి మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, బడ్జెట్‌ సమావేశాలు మొత్తం 13 పని దినాలు ఉండేలా ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే, అసెంబ్లీ సమావేశాలు రెండు విడతల్లో జరపనున్నట్టు తెలుస్తోంది.

అన్ని అనుకూలిస్తే మార్చి 22న ఉగాది నాడు విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. అదే సమయంలో రాజధానుల బిల్లు పైన ప్రభుత్వం సిద్దం అవుతోంది. కోర్టు తీర్పు ఆలస్యం అయితే ఏం చేయాలనే దాని పైన ప్రభుత్వం ప్లాన్ బీ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.