వెలుగులోకి వచ్చిన అరుదైన వీరగల్లు

విజయనగర కాలం నాటి అత్యంత అరుదైన వీరగల్లు శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం వాన వానవోలు గ్రామంలో వెలుగు చూసినట్టు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనా స్వామి తెలిపారు. వానవోలులోని రంగనాథ స్వామి గుడిని పరిశీలించాలన్న గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఆయన శనివారం నాడు గ్రామంలో పర్యటిస్తుండగా ఒక చెత్తకుప్ప పక్కన పడి ఉన్న రాతి స్తంభం ఆకర్షించింది దానిపై చెత్తాచెదారం ఉండడమే కాకుండా కట్టెలు కూడా ఉన్నాయి. 
 
గ్రామస్తుల సహకారంతో వాటిని తొలగించి బండను చూడగా అరుదైన అద్భుతమైన వీరగల్లు వెలుగులోకి వచ్చింది. వీరగల్లు వీరగల్లు క్రీస్తుశకం 1405 సంవత్సరం నాటిదిగా మైనాస్వామి గుర్తించారు. వీరగల్లు నాలుగు విభాగాలుగా ఉంది. రెండో భాగంలో ఒక శాసనం చివరి భాగంలో మరో శాసనం ఉంది. 
 
వీరగల్లు సుమారు 8 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు రెండు అడుగుల మందంతో ఉంది. మొదటి భాగంలో వీరుడు శివుని పక్కగా ఉండగా, శివుని మరోవైపు నంది వాహనం కూర్చొని ఉంది. దిగువ భాగంలో వీరుడు-వీరుని భార్య సతి సహగమనం చేయడానికి ముందు వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా శిల్పాన్ని మలిచారు. 
 
వారు ఒక వేదికపై కూర్చున్నారు వారి వారికి కుడివైపునున్న ఒక స్తంభం చాలా అరుదుగా ఉంది. అందులో ఒక చేయి శాసనాన్ని చూపిస్తున్నది. కింది భాగంలో వీరుడు నిలబడుకుని ఉండగా మరోవైపు గుర్రాన్ని నిలువరిస్తున్నాడు. 
 
శిల్పాల కింద శాసనంలో సతీసహగమనానికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. స్వస్తిశ్రీ జయ అభ్యుదయ శకవర్ష 1327 పార్థివ సంవత్సరం అని శాసనం మొదలవుతుంది. శాసనం కన్నడ భాషలో ఉంది. ఇంగ్లీషు తేదీ ప్రకారం క్రీస్తుశకం 1405లో వీరుడు వీర మరణం పొందినందుకు గుర్తుగా ఈ వీరశిలను ఏర్పాటు చేశారు. 
 
విజయనగర సామ్రాజ్యాన్ని రెండో హరి హర రాయలు పరిపాలిస్తున్న కాలంలో పెనుకొండలో జరిగిన ఒక యుద్ధంలో రామచంద్ర దేవా నాయకరు అనే ఒక వీరుడు వీరమరణం పొందాడు. రామచంద్ర దేవా భార్య గంగసాని భర్తతోపాటు సతీసహగమనం చేసినట్టు శాసనం చెబుతున్నది.  గంగసాని పామిడి కి చెందిన వ్యాపారి బయన్న శెట్టి కుమార్తె రామచంద్ర దేవా నాయకునిది బహుశా వానవోలు స్వస్థలం అయి ఉంటుంది.
అందువల్లనే అరుదైన వీరగల్లు ఆయన స్మారకార్థం వానవోలులో వెలసినట్టు చారిత్రక పరిశోధకుడు మైనా స్వామి పేర్కొన్నారు. ఇటువంటి అరుదైన వీరజల్లులను సమీప ప్రాంతంలోని పురావస్తు ప్రదర్శనశాలకు తరలించి పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వీరగల్లు విశేషాలను మైనాస్వామి ద్వారా తెలుసుకొని వానవోలు గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.