కృష్ణాపై రెండు కొత్త బ్యారేజీలపై తెలుగు రాష్ట్రాల మధ్య మరో జలవివాదం 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు పరిష్కారం పట్ల రెండు ప్రభుత్వాలు ఆసక్తి చూపకుండా, పరస్పరం ఆరోపణలకు పరిమితం అవుతున్న సమయంలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజికి దిగువన ఏపీ తలపెట్టిన రెండు కొత్త బ్యారేజీలపై మరో వివాదం చెలరేగుతుంది. 

కృష్ణాకు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజి నుంచి వృధాగా సముద్రం పాలవుతున్న వరద జలాలను ఒడిసట్టేలా బ్యారేజీలను నిర్మించనున్నారు. ప్రకాశం బ్యారేజి దిగువన 12 కిలోమీటర్ల వద్ద పెనమలూరు మండలం చోడవరం-మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య ఒక బ్యారేజీని నిర్మించేందుకు రూ 1215 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది. 

ప్రకాశం బ్యారేజ్‌కు 62 కిలోమీటర్ల దిగువున మోపిదేవి మండలం బండికోళ్లంకరేపల్లె మండలం తూర్పుపాలెం మధ్య రూ.1350 కోట్ల అంచనా వ్యయంతో మరో డ్యాము నిర్మాణానికి సైతం డీపీఆర్‌ రూపొందించారు. మొత్తం రూ.2665 కోట్ల అంచనా వ్యయంతో రెండు బ్యారేజీలను నిర్మించనున్నారు. 

బ్యారేజీల నిర్మాణం కోసం అవసరమైన మొదటి దశ సర్వే చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం రూ.204 కోట్లను కేటాయించింది. జలవనరుల శాఖ పర్యవేక్షణలో హైదరాబాద్‌ లోని ఆర్వీ అసోసియేట్స్‌ డీపీఆర్‌ లకు అనుబంధంగా సముద్ర భూగర్భ సాంకేతిక పరిశోధనకు సంబంధించి నివేదికను కూడా రూపొందించి ప్రభుత్వానికి అందించింది.

ఈ నేపథ్యంలో అతి త్వరలోనే రెండు బ్యారేజీల నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దపడుతోంది. ఈ రెండు బ్యారేజీలు పూర్తయితే సముద్రంలో కలుస్తున్న వరద జలాల్లో 7.40 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. దీని వల్ల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు అదనంగా సాగునీరు లభిస్తుంది. 

ఈ రెండు బ్యారేజిల నిర్మాణం పూర్తయితే కేవలం అదనపు సాగునీటి లభ్యత మాత్రమే కాకుండా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొత్త రోడ్డు మార్గం ఏర్పడుతుందనీ, వివిధ ప్రాంతాల దూరం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

అయితే ప్రకాశం బ్యారేజీకి దిగువన తలపెట్టిన ఈ రెండు బ్యారేజీల నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ ఇటీవల లేఖ రాశారు. ఏపీ ప్రతిపాదిత బ్యారేజీలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా పంప్డ్‌ స్టోరేజ్‌ స్కీంలతో పాటు రెండు బ్యారేజ్‌ లు నిర్మిస్తున్నట్టు లేఖలో తెలిపారు. 

తాగునీటి అవసరాలకు కాకుండా పంప్డ్‌ స్టోరేజ్‌ స్కీమ్‌, విద్యుదుత్పత్తి కోసం నీటిని తరలించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని లేఖలో కోరారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

సముద్రంలో కలిసే వృధా జలాలకు ఎంతో కొత్త అడ్డుకట్ట వేయటం ద్వారా సాగుయోగ్యం చేయటంతో పాటు నదీజలాల్లో ఉప్పునీటి శాతాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు నిర్మించతలపెట్టిన బ్యారేజ్‌ లపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయటం సముచితం కాదని స్పష్టం చేసింది. కృష్ణా కు ఏపీ దిగువన ఉందని, బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం మిగులు జలాలను వినియోగించుకునే అధికారం ఏపీకీ ఉందని అధికారులు తేల్చి చెబుతున్నారు.