నందమూరి తారకరత్న మృతి

సినీ హీరో నందమూరి తారకరత్న(40) కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో  23 రోజులుగా చికిత్స పొందుతన్న ఆయన మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.  ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు.

ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ ఛాయాగ్రాహకుడు నందమూరి మోహన్ కృష్ణ తనయుడైన తారకరత్న 1983 జనవరి 22న జన్మించారు. తారకరత్నకు  భార్య అలేఖ్య, కుమార్తె నిషిత ఉన్నారు.

జనవరి 27న టీడీపీ యువనేత నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో పాల్గొంటూ కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలారు.హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

తారకరత్నకు 23 రోజులుగా అక్కడే చికిత్సను అందిస్తున్నారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఈనెల 20న తారకరత్న అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

తారకరత్నకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. బాలకృష్ణ ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో 2002లో  వచ్చిన  ‘ఒకటో నెం. కుర్రాడు’ చిత్రంతో హీరోగా వెండితెరపైకి రంగప్రవేశం చేశారు. తారకరత్న హీరోగా దాదాపుగా 23 చిత్రాల్లో నటించారు. పలు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించి అలరించారు. ‘అమరావతి’ సినిమా ఆయనకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డును తీసుకొచ్చింది. ఈ చిత్రం 2009లో విడుదలైంది. 

తారకరత్న 2002లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. తారకరత్న 2022లో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు. ‘9 అవర్స్‌’ వెబ్‌‌సిరీస్‌లో నటించారు. చివరిగా ‘సారధి’ మూవీలో కనిపించారు.

ప్రధాని మోదీ సంతాపం

నందమూరి తారకరత్న మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు తారకరత్న మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ ట్విట్టర్‌లో స్పందించారు. ‘నందమూరి తారకరత్న అకాల మరణం బాధాకరం. చలనచిత్రాలు, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి’ అంటూ మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తారకరత్న మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె చంద్రశేఖరరావు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తారకరత్నం మరణం తీవ్ర బాధను కలిగించిందని, టీడీపీకి తీరని లోటు అని చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణం కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తారకరత్న కన్నుమూయడం బాధాకరమని పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బండి సంజయ్ కూడా సంతాపం తెలిపారు.