మహబుబాబాద్‌లో వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబుబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ (పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో షర్మిలను అరెస్టు చేశారు. ఈ మేరకు నోటీసులు అందజేసిన పోలీసులు.. అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు. షర్మల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర అనుమతిని కూడా రద్దు చేశారు.
 
 మహబూబాబాద్‭లో పాదయాత్ర చేయకుండా ఆమెకు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. షర్మిల పాదయాత్రను ఎలాగైనా అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్‭కు షర్మిల క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
 
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఎలాగైనా పాద్రయాత్ర చేసేందుకు మహబూబాబాద్ వెళ్లిన షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా నెళ్లికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైఎస్ షర్మిల బస చేసిన ప్రాంతానికి ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం ఉదయం భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. ముందు జాగ్రత్తగా భారీగా మోహరించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని షర్మిలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
అంతకు ముందు, వైఎస్సార్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన నేపథ్యంలో పాదయాత్ర కొనసాగిస్తే పరిస్థితులు చేయి దాటే అవకాశముందని అరెస్ట్ చేసిన్నట్లు చెబుతున్నారు.
 
అంతకుముందు నెళ్లికుదురు మండల కేంద్రంలో వైఎస్ షర్మిల శంకర్‌నాయక్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో  చూస్తా.. అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేస్తున్న మోసాలను ఎత్తి చూపిస్తుంటే భయంగా ఉందా? అంటూ ప్రశ్నించారు.
 
“మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు వైయస్ఆర్ బిడ్డ. మీరు చేసిన మోసాలపై, అక్రమాలపై బరాబర్ ప్రశ్నిస్తాం. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మమ్మల్ని కొజ్జాలని తిడతాడట. ఎవర్రా మీకు కొజ్జాలు? ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవడం చేతకాని మీరు కొజ్జాలు. మహిళను పట్టుకొని కొజ్జా అంటే ప్రజలే తరిమి కొడతారు.. ఖబడ్దార్!’ అంటూ షర్మిల హెచ్చరించారు.