మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన శివాజీ

 
* జన్మదిన నివాళి
 
చత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 – ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి నాడు తిరుగులేరని భావిస్తున్న మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన పోరాట యోధుడు. సుమారు ఆరు శతాబ్దాల అనంతరం భారతీయులలో స్వాభిమానం పెంపొందింపచేసి, స్వరాజ్య కల్పనను కలిగించిన ధీశాలి.
 
ఆధునిక ప్రపంచంలో శివాజీ అనుసరించిన యుద్ధతంత్రాలు నేటికీ పలుదేశాల సైనికులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అనేకదేశాల సైనిక శిక్షణాంశాలలో భాగంగా చేర్చారు.  గెరిల్లా యుద్ధ విధానం శివాజీతోనే మొదలయింది. కొత్త ఆయుధాలను కనుగొని వాటితో యుద్ధాలు చేయించడం శివాజీకి ప్రత్యేక అభిరుచి. పటిష్ఠమయిన నౌకా దళాన్ని, ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసాడు.
ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించారు.
 
1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆయుధాలను, అశ్వాలను, నావికాదళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 17 ఏళ్ళ వయసులో మొదటి యుద్ధం చేసి బీజాపూర్‌ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌గఢ్‌ కోటల ను సొంతం చేసుకొని పూణె ప్రాంతాన్నంతా స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. యుద్ధ తంత్రాల్లోనూ శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది.
 
శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువుపైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు.
 
శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కున్భీ కులానికి చెందినవారు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది.
 
షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.
 
షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి, యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది.
 
చిన్నప్పటినుండి భారత రామాయణ బలి చక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.
 
శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు.
 
మొఘలులతో యుద్దాలు
 
శివాజీ నుండి ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలు పెట్టాడు. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్‌కు లక్షకు పైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు.
 
బలమయిన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్‌లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నాడు. ఓటమి తప్పనిపిస్తే, యుద్ధం నుండి తప్పుకోవాలి. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం
 
ఎప్పటికయినా శివాజీ మెరుపు దాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసాడు. 1663 ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలసి పెళ్ళికూతురు తరపున బంధువుల్లో కలసిపోయి లాల్ మహల్ చేరుకొన్నాడు.
 
ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది. కాబట్టి, సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకొన్నాడు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ మూడువేళ్ళు తెగి కింద పడగా, షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షైస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు.
 
1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమయిన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు. కొద్దిరోజుల్లో మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు.
 
ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన  రాజా జై సింగ్‌ను శివాజీపైకి పంపించాడు.రాజా జై సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.రాజా జై సింగ్ అద్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర్ దుర్గాన్ని ఆక్రమించాయి.తర్వాత రాయఘర్ ఆక్రమణకు సేనలు ముందుకు సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజా జై సింగ్ తో సంధికి దిగాడు .
 
1665లో శిబాజి రాజా జై సింగ్ తో పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు. తర్వాత తాను కూడా ఒక మొఘల్ సర్దార్‌గా ఉండడానికి అంగీకరించాడు.  మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శతృవులయిన బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దార్‌గా ఉండడానికి ఒప్పుకున్నాడు.
 
1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజి బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేశారు.
 
తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు.
కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు.
 
మువ్వాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీని రాజుగా గుర్తించాడు.కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచాలైనది. మొఘలు సైనాధిపతులు మహాబత్ ఖాన్,బహుదూర్ ఖాన్, దిలేవార్ ఖాన్ లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేశారు. కానీ వారి ఎత్తులు పారలేదు.శివాజీతో యుద్దంలో వారు ఘోర పరాజయం పొందారు. శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కొనవచ్చు.
 
అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు.
 
1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది.
 
 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు.
 
పరిపాలనా విధానం
 
యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు.
 
సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసాడు.
 
ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో “నా తల్లి కూడా మీ అంత అందమైనది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని” అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు.
 
శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విదంగా గౌరవించబడ్డారు.