బీబీసీ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు పలు కీలక ఆధారాలు

బీబీసీ భారత్ కార్యకలాపాలకు సంబంధించి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు పలు కీలక ఆధారాలు లభించాయని ఆదాయ పన్ను అధికారులు వెల్లడించారు. పన్ను ఎగవేత, ఆదాయ అక్రమ మళ్లింపు తదితర ఆరోపణలపై దాదాపు మూడు రోజుల పాటు భారత్ లోని బీబీసీ కార్యాలయాలపై ఆదాయ పన్ను అధికారులు సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. బీబీసీ గ్రూపు సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్‌లో ఆ సంస్థల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) పేర్కొంది. 

ముంబై, ఢిల్లీల్లోని బీబీసీ కార్యాలయాలలో జరిపిన సర్వేలో పన్ను ఎగవేత, తప్పుడు ఆదాయ లెక్కలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు శుక్రవారం వెల్లడించింది. ఉద్యోగుల ప్రకటనలు,  డిజిటల్ ఆధారాలు, పత్రాల రూపంలో తమకు పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని ఐటీ అధికారులు వెల్లడించారు.

భారత్ లో కార్యకలాపాల వల్ల లభించిన ఆదాయానికి సంబంధించి తప్పుడు లెక్కలు చూపినట్లు స్పష్టమైన సాక్ష్యాధారాలు లభించాయని పేర్కొన్నారు. బీబీసీకి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందో సరైన వివరాలు అందించడం లేదని తెలిపింది. డాక్యుమెంట్లు తగిన సమయంలో చూపలేదని కూడా ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

కొన్ని ఆదాయాలకు సంబంధించి చట్టపరంగా చెల్లించాల్సిన ఆదాయ పన్నును చెల్లించలేదని తేలిందని వెల్లడించారు. ఆ ఆదాయానికి సంబంధించిన వివరాలను కూడా బీబీసీ ఇండియా విభాగం వెల్లడించలేదని తెలిపారు.  ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సిబ్బంది నుంచి సమాచారాన్ని రాబట్టారు. బీబీసీ కంపెనీ నిర్మాణం, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి డేటాను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 2012 నుంచి అకౌంట్ల వివరాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

భారతదేశం నుంచి సొమ్మును విదేశాలకు తరలించడం, భారతదేశంలోని బీబీసీ అనుబంధ సంస్థల మధ్య ఇష్టం వచ్చినట్లు లావాదేవీలు చేయడం ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. బీబీసీ అనుబంధ సంస్థల ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌కు సంబంధించిన అంశాలపై దర్యాప్తు చేసేందుకు సోదాలు నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు.

తాత్కాలికంగా సేవలు అందించడానికి విదేశాలకు పంపిన ఉద్యోగులకు చెల్లించిన జీతభత్యాల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో ఆరోపించింది. ఆదాయపు పన్నుశాఖ అధికారులు. బీబీసీ ఢిల్లీ ఆఫీసుకు చెందిన సీనియర్ ఎడిటర్లతో పాటు మొత్తం మీద 10 మంది ఉద్యోగులు.. మూడు రోజుల తర్వాత ఇళ్లకు చేరుకున్నారు. సంబంధి వర్గాల ప్రకారం.. సర్వేలో భాగంగా అనేక మంది బీబీసీ ఉద్యోగుల ఫోన్స్ను అధికారులు తీసుకున్నారు. వాటితో పాటు ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ని కూడా క్షుణ్నంగా పరిశీలించారు. ట్యాక్స్, బ్లాక్ మనీ, బినామీ వంటి పేర్లతో డివైజ్లను సెర్చ్ చేశారు.